March 30, 2019

క్రీస్తుద్వారా విమోచన పొందిన గాడిదపిల్ల

గాడిదలా జీవించు...

పరిశుద్ధ గ్రంధం చెబుతున్న అద్భుతకరమైన 3 విషయాలు

బైబిల్లో చాలా సందర్భాలలో గాడిదకు సంబందించిన ప్రస్తావన వస్తుంది.  దేవుడు తన పరిశుద్ధ గ్రంధములో గాడిదకు, గాడిదపిల్లకు ప్రత్యేకమైన స్థానాన్ని అనుగ్రహించాడు అని చెప్పవచ్చు.

దావీదుకు ఆహారాన్ని మోసినా, కరువుకాలంలో యేసేపు తన తండ్రి కుటుంబానికి మూటలకొద్దీ ధాన్యాన్ని ఐగుప్తునుండి తరలించినా, యెహోవా దేవుని దూతనుచూచి బిలామును హెచ్చరించినా, ఇవన్నీ గాడిదకు మాత్రమే సాధ్యపడ్డాయి.

అంతేకాదు గాడిద పచ్చి దవడ ఎముకతో ఆనాడు సమ్సోను వెయ్యిమందిని అవలీలగా అంతమొందించాడంటే అది ఎవరికీ సాధ్యం? అలాగే దావీదు, ఆయన కుమారుడైన సాలొమోను ఇంకా అనేకమంది ప్రవక్తలు గుర్రాలను కాకుండా గాడిదలనే తమ వాహనాలుగా ఎంచుకున్నట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే పరమ పునీతుడు, పదివేలమందిలో అతిసుందరుడైన మన యేసుక్రీస్తు నాడు యెరూషలేము దేవాలయానికి గాడిదపిల్లను అధిరోహించి వచ్చాడూ అంటే మనకు ఈపాటికే అర్ధం అయ్యే ఉంటుంది గాడిదకు మన తండ్రి ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చాడో.

ఇంకా లోతుగా పరిశీలిస్తే బైబిల్లో ప్రకటించబడిన దేవుని వాక్కును ఒకవైపు ప్రవక్తల ద్వారా, మరోవైపు ప్రవక్తల ప్రవచనాల ద్వారా లోకానికి అందించడంలో గాడిదపిల్ల దేవుని ప్రతినిధిగా వ్యవహరించిందని భావించవచ్చు.

అంతటి వైవిధ్యం కలిగిన గాడిదపిల్లను గురించి, దాని గొప్పదనాన్ని వివరించే ఆయా సందర్భాలకు సంబందించిన  3 ముఖ్యమైన విషయాలను మనమిప్పుడు ధ్యానించుకుందాం. 

1 గాడిద దేవునిద్వారా విమోచించబడినది. 

ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. నిర్గమకాండము 13:13. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మొదట జన్మించిన దూడను గానీ, గొర్రెపిల్లను గానీ యెహోవా దేవునికి సమర్పించవలసి ఉంది. కానీ గాడిదపిల్ల మాత్రం దానికి ప్రతిగా గొర్రెపిల్లను దేవునికి సమర్పించుకుని విమోచింపబడింది.  

ప్రతి తొలిచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగాడి దూడయే గానీ గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపించవలెను. దాని విమోచింపని యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు నిర్గమకాండము 34:19-20. ఈ వాక్యం తేటతెల్లంగా మనకు చెప్పేది ఏమిటంటే గాడిదపిల్ల దేవునిద్వారా విమోచించబడింది అని. ఒకవేళ గాడిదపిల్ల బదులుగా గొర్రెపిల్లను సమర్పించడం ద్వారా గాడిద విమోచింపబడనట్లైతే, గాడిదపిల్లకు ఈ భూమ్మీద జీవించడానికి సాధ్యపడేది కాదు, ఎందుకంటే యేసయ్య దేవుని గొర్రెపిల్ల అని పరిశుద్ధగ్రంధమే చెబుతుంది కాబట్టి (యోహాను సువార్త 1:35-37). కాబట్టి గాడిదను పోలి జీవించుటలో మనం ఏ మాత్రం సిగ్గుపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తుద్వారా మనకు శాశ్వతమైన విమోచనము లభించింది కాబట్టి (ఎఫెసీ 1 :7 , ప్రకటన గ్రంధము 21:27). 

2. గాడిద వివేకము కలిగిన ప్రాణి 

సంఖ్యాకాండము 22:21-34 వ వచనం వరకు మనం గమనిస్తే ప్రవక్త అయిన బిలాము గ్రహించలేని దానిని ఓ గాడిద గ్రహిస్తుంది. బిలాము చూడలేని దానిని గాడిద చూడగలుగుతుంది. దేవుని దూతను చూడలేని బిలాము గాడిదను అడ్డుకుంటున్నా.. కొడుతున్నా కూడా ఆ గాడిద యెహోవా దూతను చూచి తాను నడుస్తున్న త్రోవను విడిచి పొలాల్లోకి తీసుకువెళుతుంది, చివరకు ప్రాణాలు తీయడానికి ఎదురు నిలిచిన దేవుని దూత ఖడ్గపు బారినుండి బిలామును రక్షించి కాపాడగలుగుతుంది.

అదేవిధంగా 2 పేతురు 2 :16 వచనంలో తెలిపినట్లు గాడిద నోరులేని ప్రాణి అయినా కూడా బిలాముకంటే వివేకము కలిగి వ్యవహరించిందని పేతురు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో గాడిదను పోలి వివేకంతో జీవించాలి. బిలామును గాడిద ఏ విధంగానైతే హెచ్చరించిందో అదే రీతిగా మనమూ ఈ లోకములో క్రీస్తును ఎరుగని వారికి ఆయన ప్రేమను గురించి, ఆయన అందించే రక్షణ గురించి తెలియచేయాలి. తెలియచేయడం మన బాధ్యత, వింటారో లేదో అది వారి సమస్య. మనం తెలిసీ యేసయ్యను గురించి ప్రకటించకపోవడం మన తప్పు అవుతుంది అని గ్రహించాలి. 

దీనికి సంబంధించి పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2:6-10 వచనాల్లో మన భాద్యతను గురించి చక్కగా వివరించాడు. 

3 గాడిద పిల్ల యేసయ్యను మోసి బహు ధన్యతను పొందినది. 

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును, దీనుడునై, గాడిదపిల్లను ఎక్కి నీ యొద్దకు
వచ్చుచున్నాడు. జెకర్యా 9:9. మట్టల ఆదివారం నాడు గాడిదపిల్లను ఎక్కి ప్రజల  జయజయధ్వానాల మధ్య యేసుక్రీస్తు యెరూషలేము నగర ప్రవేశం చేస్తాడు. ఆనాడు అలా యేసయ్యను తనపై ఎక్కించుకుని మోయడం ద్వారా గాడిదపిల్ల ఎనలేని గౌరవాన్ని సంపాదించుకుంది. 

అందుకే పౌలు మనల్ని ఉత్తేజితులను చేస్తూ రోమా పత్రిక 12:1-2 లో ఇలా అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి రోమా పత్రిక 12:1-2. 

చూసారా, మనం దేనికి పనికిరాని వాళ్ళను గాడిదా అని సంబోధిస్తాము, కానీ అదే గాడిదకు పరిశుద్ధ గ్రంధములో మన తండ్రి ఎంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడో చూడండి. అందుకే మన ఆలోచనలు వేరు, తండ్రి ఆలోచనలు వేరు, మన చిత్తం వేరు ఆయన చిత్తం వేరు. ఆనాడు గాడిదపిల్లను విమోచించడానికి గొర్రెపిల్లను బలి ఇచ్చారు. ఆ తరువాత గాడిదపిల్లల వంటి మనకొరకు యేసయ్య గొర్రెపిల్లగా తనకు తానుగా బలిపశువుగా మారి మనకు శాశ్వత విమోచనము అందించాడు. విమోచింపబడిన మనం ఆయన కృపను మరువక దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయనకు మోసి.. ఈ లోకానికి దేవునివాక్కును, ఆయన అందించిన ప్రేమను పంచి సకల లోక రక్షణకు పాటుపడదాం. ఆమెన్.   

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

March 26, 2019

యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు ? || JESUS CHRIST RAISED THE DE...

యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు???

యేసుక్రీస్తు తన మూడున్నరయేళ్ల పరిచర్యలో భాగంగా ఈ భూమ్మీద ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసాడు. స్వస్థతలను అనుగ్రహించాడు, సుమారు 40 కి పైగా అద్భుతకార్యాలు చేసాడని సువార్తలు చెబుతుండగా అంతకుమించి సువార్తల్లో పొందుపరచని మరెన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు చేసాడని యోహాను సువార్తికుడు తన సువార్తలో పేర్కొన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యల్లో గొప్ప అద్భుతం చనిపోయినవారిని బ్రతికించడం. మరణించిన ముగ్గురిని క్రీస్తు బ్రతికించగా అందులో ఇద్దరినీ చనిపోయిన వెంటనే వెళ్లి బ్రతికించాడు, మరొకర్ని చనిపోయిన నాలుగు రోజుల తరువాత కుళ్లిపోతూ దుర్గంధభరితమైన పరిస్థితిలో యేసు ఆ శవానికి కన్నీటితో ప్రార్ధించి ప్రాణం పోశాడు.

1  యాయీరు కుమార్తెను బ్రతికించాడు.

సమాజ మందిరపు అధికారి అయినా యాయీరు తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, వచ్చి కాపాడమని క్రీస్తును ప్రాధేయపడతాడు. అతని విన్నపాన్ని అంగీకరించిన యేసు యాయీరు ఇంటికి బయలుదేరి వెళతాడు. ఆ మార్గమధ్యం లోనే రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న స్త్రీ యేసు అంగీని తాకి స్వస్థతను పొందుకుంటుంది. ఈలోగా యాయీరు ఇంటికి వెళ్లే దారిలో ఉండగానే ఆ అధికారి కూతురు చనిపోయిందని కబురు వస్తుంది, యేసు భయపడక నమ్మిక మాత్రము ఉంచుము ( మార్కు సువార్త 5:36) అంటూ అతని ఇంటికి వెళ్లి రోదిస్తున్న వారి కుటుంబాన్ని చూచి చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని పలికి..ఆ చిన్నదాని చెయ్యిపెట్టి చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే పన్నెండు సంవత్సరాల ఆ చిన్నది లేచి నడుస్తుంది. ఇది చనిపోయిన వారిని యేసు బ్రతికించిన మొదటి కార్యము (మార్కు సువార్త 5:22-43, మత్తయి సువార్త 9:18-26 , లూకా సువార్త 8:40-56)

2 విధవరాలి ఒక్కగానొక్క కుమారుడుని బ్రతికించడం

తాబోరు పర్వత సమీపంలోని నాయిని అనే ఊరిలో ఓ విధవరాలు నివసిస్తూ ఉంటుంది, ఒకరోజు ఆ విధవరాలి కుమారుడు చనిపోతాడు. ఆ ఉరి ప్రజలు అతనిని తీసుకుని సమాధి కార్యక్రమాలు నిర్వహించడానికి మోసుకుపోతుండగా యేసుక్రీస్తు అప్పుడే ఆ గ్రామంలోకి ప్రవేశిస్తాడు. వేదనకరంగా రోదిస్తున్న అతని తల్లిని చూచిన యేసు ఆమెపై కనికరపడి ఏడువవద్దని ఆ విధవరాలుని ఓదారుస్తాడు. పాడెను మోస్తున్న వారిని ఆపి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే ఆ చిన్నవాడు పాడెపై నుండి లేచి కూర్చుని మాట్లాడటం మొదలుపెడతాడు (లూకా సువార్త 7:11-15) ఇది చనిపోయిన వారిని బ్రతికించడంలో యేసు చేసిన రెండవ అద్భుతకార్యం. 

3 మరియ మార్తల సహోదరుడైన లాజరును బ్రతికించడం

లాజరు బేతనియాకు చెందిన మరియ మార్తల సహోదరుడు. యేసుక్రీస్తుకు ఎంతో ఇష్టమైనవాడు. లాజరు రోగగ్రస్తుడై చనిపోయిన నాలుగు రోజుల తరువాత యేసు బేతనియా గ్రామం చేరుకుంటాడు. మరియ, మార్త ఇంకా యెరూషలేము, బేతనియా గ్రామాల ప్రజలు వీరితో పాటు యేసు అందరూ కలిసి లాజరు సమాధి దగ్గరకు చేరుకుంటారు. సమాధికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించగా భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తుంది. యేసు సమాధి ముందర కూర్చుని కన్నీళ్లు విడిచి కన్నులు పైకెత్తి తండ్రిని ప్రార్ధిస్తాడు. ఆపై లాజరూ బయటకు రమ్మని బిగ్గరకా కేక వేస్తాడు. ఆ మాటతో చనిపోయి నాలుగు రోజులక్రితం సమాధి చేయబడిన లాజరూ కాళ్లకు చేతులకు ప్రేత వస్త్రాలు, ముఖానికి రుమాలుతో బయటకు వస్తాడు. యేసు అక్కడ ఉన్న వారితో మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడని చెబుతాడు. చనిపోయిన లాజరు బ్రతకడం చూచిన యూదులలో అనేకమంది యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారు. 

యేసు తాను సిలువపై మరణించి పునరుత్తానుడయ్యే ముందు చేసిన చివరి అద్భుతకార్యము లాజరును మృత్యువు బారినుండి బ్రతికించడం. 

నమ్ముట నీవలనైతే సమస్తమూ సాధ్యమే అన్న మన తండ్రి మాటలను విశ్వసించగలిగితే తప్పక మనమూ మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు చూడగలుగుతాము, ఆమెన్.

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik link here:  యేసుక్రీస్తు బ్రతికించిన ఆ ముగ్గురు ఎవరు ? 


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

March 22, 2019

Jesus Fourth Word on the Cross - Eli, Eli, lema sabachthani -

నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు 
యేసుక్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట
Jesus Christ Seven Words on the Cross

యేసుక్రీస్తు తాను సిలువలో మరణించే ముందు పలికిన ఏడు మాటలు గురించి తెలియని క్రైస్తవులు ఉండరు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దినాలలో ఈ వాక్యాలు మీదే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం. ఈ ఏడు మాటల్లో ఒకటైన నాల్గవ మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేమిటో.. అందులో ఉన్న మర్మమేమిటో మనమిప్పుడు తెలుసుకుందాం.
నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు. మత్తయి సువార్త 27:46

మనకు ఒకింత ఆశ్చర్యం, ఆందోళన కలిగించే మాట ఇది. రోమన్ సైనికులు యేసును బంధించి, ఘోరాతి ఘోరంగా హింసించి ఆపై ఆయనను చంపడానికి సిలువ మ్రానుపై వ్రేలాడదీసిన ఆ శుక్రవారం రోజు.. యేసు సిలువలో మరణవేదన పొందుతూ ఏలి.. ఏలి.. లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆ మాటకు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్ధం. దీనినే మనం సిలువలో నాల్గవ మాటగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము (మత్తయి సువార్త 27:46 ).

క్రీస్తు జన్మించక మునుపే ఆయన దేవుని కుమారుడని ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి. యేసే తాను దేవుని కుమారుడనని శిష్యులతో పలుమార్లు ప్రస్తావిస్తాడు కూడా. మరి దేవుని కుమారుడైన యేసు ఓ మామూలు మనిషిలా అలా ఎందుకు తన తండ్రిని నన్నెందుకు చెయ్యి విడిచావు అని ప్రశ్నించాడు?

అంతేకాక యూదా ఇస్కరియోతు ద్వారా తనను బంధించి, మరణశిక్ష విధించి చంపుతారని యేసుకు ముందే తెలుసు, తాను చావుకు ఏమాత్రం భయపడకుండా తనకోసం వెదుకుతున్న సైనికులకు తానె ఎదురెళ్లి మరీ మీరు వెదుకుతున్న యేసును నేనే అని చెప్తాడు. ఇంత తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించాడు. ఇందులో ఉన్న మర్మం ఏమిటి? ఇంత లోతైన విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి.. అప్పుడు మన విశ్వాసం మరింతగా బలపడుతుంది..

యేసు ప్రభువు జీవించిన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు హెబ్రీ అరామిక్ భాషలను మాట్లాడేవారు. ఈ ఏలి ఏలి లామా సబక్తానీ అనే వాక్యంలో ఏలి అనే పదం హెబ్రీ భాషకు చెందినది అయితే... లామా సబక్తానీ అనే పదం అరామిక్ భాషకు సంబంధించి పదం.
యేసుక్రీస్తు సిలువలో ఈ మాటలు పలికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రవక్త ఐన ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని భావిస్తారు. కానీ ఈ మాటకు గ్రంధకర్తలు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని సరియైన అర్ధం మనకు అప్పుడే చెప్పారు.

తన తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేయడానికే తాను ఈ లోకానికి వచ్చానని యేసుకు  తెలుసు, అదేవిధంగా తాను ఎవరినైతే వారి పాపాలనుండి రక్షించి పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించాలని తలంచాడో ఆ మనుష్యులే నేడు తనను సిలువ వేసి ఘోరంగా చంపుతారని క్రీస్తుకు తెలుసు, అలాగే ఆయన శిష్యులకూ తెలుసు. కాబట్టి ఆయన సిలువపై వేదన చెందడం అక్కడే ఉన్న ఆయన జనాంగానికి పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కాబట్టి వారూ కంగారు పడలేదు. కానీ అక్కడే ఉన్న యెరూషలేము పట్టణవాసులు మాత్రం వాస్తవాన్ని తెలుసుకోలేక క్రీస్తు ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని అనుకున్నారు.

దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని యేసు ఎందుకు తన తండ్రి ప్రశ్నించి ఉంటాడు? ఎందుకు ఓ సాధారణమైన మామూలు మనిషిలా సిలువపై అంత దీనంగా తన తండ్రిని అర్ధించాడు? ఈ విషయాలను లోతుగా అధ్యయనం చేస్తే యేసు మొదట దేవుని కుమారుడు, కానీ తనకు తానుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు అయ్యాడు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుని కుమారుడు, అదేవిధంగా ఆయన ఈ భూమిపై జన్మించడం మూలాన పరిపూర్ణమైన మనుష్య కుమారుడుగా కూడా తనను తానూ మార్చుకున్నాడు.

మత్తయి సువార్తలో మనం యేసు సిలువ మరణం పొందే సందర్భాన్ని ధ్యానం చేస్తుంటే కీర్తనలు 22 వ అధ్యాయం మనకు తప్పక జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి మరణానికి చేరువ అవుతుంటే ఆ వ్యక్తి ఎంతటి ఎంతటి వేదనను అనుభవిస్తాడో క్రీస్తు కూడా ఓ సాధారణ మనిషిలా తనకు తానుగా సిలువలో కష్టాన్నిఅనుభవించాడు, మౌనంగా భరించాడు, అందులోని బాధను తన తండ్రికి విన్నవించాడు.. అలా మనకు ప్రతినిధిలా.. తండ్రికి మనకు మధ్య ఓ వారధిలా ఆ రోజు యేసు సిలువలో మన పక్షాన సాధారణ మనిషిలా నిలిచి శిక్షను అనుభవించి దేవుని కుమారునిలా మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు.

కాబట్టి ఆనాడు సిలువలో క్రీస్తు అనుభవించిన ఆ వేదన ఓ సాధారణ మనిషి అనుభవంలా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా కీర్తనల గ్రంధంలో చెప్పినట్లు.. 'ఈ భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవా తట్టు చేసెదరు (కీర్తనలు 22:27) అనే వాక్యాన్ని తనకూ ఆపాదించుకుంటూ క్రీస్తు కూడా తన తండ్రి వైపు తిరిగి కన్నులెత్తి రోదించాడు అని భావించాలి.

దీన్ని బట్టి యేసు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించడంలో ఉన్న పరమార్ధం మీకు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుంది. క్రీస్తు మనకొరకు సిలువలో కన్నీరు కార్చాడు, మనకు సమానార్ధమైన శిక్షను తాను భరించాడు. ఓ మానవ మాత్రునిలా మన స్థానంలో ఉండి  మనకొరకు తన తండ్రిని సైతం ప్రశ్నించాడు. మరి ఇంకా మన జీవితాలు మారకుంటే క్రీస్తు సిలువలో కార్చిన రక్తానికి ఫలితమేముంటుంది? ఆయన అనుభవించిన వేదనకు అర్ధం ఏముంటుంది? ఆలోచించండి!

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి

యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావన్నాడు?



ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.