ప్రార్ధనా శక్తి … సాతాను నుండి విముక్తి
ప్రార్ధన అనేది బహు శక్తి వంతమైనది. దేవునికి మనకి మధ్య ఏ అడ్దు తెర లేకుండా చక్కగా మనం మన తండ్రితో మట్లాడడానికి, ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చమని ప్రార్ధించడానికి ఒక చక్కని మార్గం ప్రార్ధన! మనం ఏమై ఉన్నమో, మన భవిష్యత్తు ఏమిటో మనకు తెలియదు కానీ దేవునికి సర్వమూ తెలుసు. యేసయ్య కూడా మనల్ని ఓ తండ్రిలా నిరంతరం కాపాడుకుంటూ .. మనకు కావలిసిన వాటిని ఏర్పాటుచేస్తూ నిత్యమూ మనల్ని కాచుకొని ఉంటాడు. కానీ, తండ్రికి మనల్ని దూరం చేయడానికి సాతాను చీకటి తలంపులతో మన ప్రక్కనే పొంచి ఉంటాడు. అదను చూసి మన జీవితాల్లొకి ప్రవేశించి మనకూ, మన కుటుంబాలకు నెమ్మది లెకుండా చేయడమే వాడి పని. అపవాది తంత్రాలలో పడి మనం మన తండ్రిపై ఉన్న నమ్మకం ఎప్పటికీ కోల్పోకూడదు.
ఇక్కడ మనం ఒక విషయం తప్పకుండా జ్జాపకం చేసుకొవాలి, నమ్మకం ఉన్నంతసెపు నీళ్ళపై నడవగలిగిన పేతురు ఏప్పుడైతె ఎప్పుడైతే అనుమానం అతని మనసులో చోటు చేసుకుందో మరుక్షణమే పేతురు నీళ్ళలొ మునిగి పొవడం ప్రారంభమైంది. ఆనాడు నీళ్ళల్లో మునిగి పొతున్న పేతురును చెయ్యి పట్టి లాగిన యేసయ్య, ఈరోజు మనకు కూడా తన చేతిని అందించడానికి సిద్ధంగా ఉన్నాడని అస్సలు మరిచిపోకూడదు. మన జీవితాల్లో సాతాను శోధనలు ఎదిరించి నిలబడడానికి, దేవునిలో మనం నిరంతరం నిలిచి ఉండడానికి ప్రార్ధన ఒక్కటే మనకున్నఎకైక మార్గం. మనం సాతానుకు వ్యతిరేకంగా పోరాడటానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి. అందుకు ప్రార్ధన ఒక్కటే బలమైన సాధనం. అందుకే సాతాను శోధనలకు వ్యతిరేకంగా ఎలా ప్రార్ధించాలి? యేసయ్యలో ఎలా జీవించాలి అనే ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1 సిద్దపాటు కలిగి జీవించాలి: ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అంతా మనమంతా ఏ విధంగ సిద్ధపాటు కలిగి జీవించాలో చాలా స్పష్టంగా వివరించింది. ఎఫిసీ పత్రిక 6:11వ వచనంలో చెప్పినట్లుగా సాతానుని ఎదిరించడానికి మనం శక్తిమంతులం అయ్యేవిధంగా, దేవుడిచ్చిన ప్రార్ధన అనే సర్వంగ కవచాన్ని ధరించాలి. అంతేకాక అనుక్షణం మనల్ని కబళించడానికి మనప్రక్కనే పొంచియుండే సాతాను కుతంత్రాలను ఎదుర్కోనడానికి మనం తప్పనిసరిగా సిద్ధపాటు కలిగి జీవించాలి.
2 సాతానుకు వ్యతిరేఖంగ ప్రార్ధించాలి: పాపానికి ప్రతిరూపమైన సాతాను ఎంతో బలవంతుడు మరియు తెలివైనవాడు. దేవుని బిడ్డలను పడగొట్టటం, చీకటి తలంపులను రేపి మనిషిని అధఃపాతాళానికి త్రోసివేయడమే వాడి పని . 2 కొరింథీ 2: 10,11 వచనాల్లొ సాతాను ఎంతటి తెలివైనవడో పౌలు మహశయుడు తన మాటల్లొ తెలియజేస్తున్నాడు. సహోదరుల మధ్య ఐక్యతను చెడగొట్టగలడు, సంఘాలను నిట్టనిలువునా చీల్చి వేయగలడు. భళా నమ్మకమైన దాసుడా అని అనిపించుకున్న వారిని సైతం అధఃపాతాళానికి తొక్కేయగలడు అందుకే సాతాను మన జీవితాల్లోకి ప్రవేశించకుండా, వాడి ప్రభావం మన జీవితాల్లో పడకుండా నిరంతరం మెలకువతో ప్రార్ధించాలి.
3 సువార్త వ్యాప్తి కొరకు ప్రార్ధించాలి: దేవుని సువార్త లోకంలో వ్యాప్తిచెందకుండా సాతాను అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు. దేవుని సువార్త విశ్వవ్యాప్తం అయితే సాతాను ఉనికి ఈ ప్రపంచంలొ ఉండదనే సంగతి వాడికి బాగా తెలుసు. సాతానుకి కావలిసింది ఈ లోకంలో ఏ ఒక్కడూ రక్షింపబడకుడదు. 2 కొరింధీ 4:4 వచనంలో దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాశులైన వారి మనొ నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అని పౌలు గారు సాతాను విన్యాసాలను మన కళ్ళకు కట్టినట్లుగా చెప్తున్నాడు. అంతే కాదు సాక్షాత్తూ పౌలు మహశయుణ్ణే థెస్సలోనికలోని సంఘాన్ని దర్శించకుండా సాతాను అడ్డుపడుతున్నాడని 1 థెస్సలొనిక 2:18 వ వచనంలొ మనకు తెలియ పరుస్తున్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి సాతాను ఎంతటి బలవంతుడో మనం అర్ధం చేసుకొవాలి. కాబట్టి దేవుని సువార్త అవసరాన్ని మనం గుర్తించి మనమూ దేవుని సువార్త వ్యాప్తికి మన వంతు సహాయంగా ప్రతిదినం ప్రార్ధించాలి.
4 తోటి వారి కొరకు ప్రార్ధించాలి : మన స్నేహితులు, బంధువులు, సంఘస్తులు వారి కుటుంబాలు సాతాను వలలో పడకుండా కృప చూపి కాపాడమని దేవుని ప్రార్ధించాలి. లూకా 22: 32 వ వచనంలో నీ నమ్మిక తప్పిపొకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహొదరులను స్థిరపరచమని చెప్పెను. అంటే యేసయ్య తన శిష్యుల కొరకు నాడు తన తండ్రిని వేడుకున్నట్లే మనమూ మన తోటి వారిని సాతాను శోధనలో పడకుండా తప్పించమని దేవుణ్ణి ప్రార్దించాలి.
5 సంఘం కొరకు ప్రార్ధించాలి: యొహాను సువార్త 17: 15 లో నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్ధించుటలేదు గాని దుష్టుడు నుండి వారిని కాపాడమని ప్రార్ధించుచున్నాను. మనుష్యులు కాబట్టి కోపాలు సహజంగానే వస్తాయి. అంత మాత్రాన ఆ కోపాలు మనుష్యుల్ని సంఘాల్ని విడదీసేంతగా ఉండకూడదు. ఎందుకంటే సాతాను తనకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎఫేసి పత్రిక 4: 26-27లో సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు, అపవాదికి చొటియ్యకుడి అంటాడు.
ఇక చివరగా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యోహాను 4:4 వ వచనంలో చిన్న పిల్లలార, మీరు దేవుని సంబందులు , మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి యున్నారు అని ఉంటుంది. సాతాను మనలను జయించడానికి, అధపాతాళానికి ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా.. మరెన్ని ఎత్తుగడలు వేసినా మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య ఏనాడైతే మరణపు ముల్లు విరిచి సమాధి నుండి సజీవునిగా మరణాన్ని జయించి బయటకు వచ్చాడో ఆ రోజే మనమూ యేసయ్య బిడ్డలుగా ఈ లోకన్ని జయించినవారం అయ్యాము. అంతటి శక్తిని యెసయ్య మనకు ఆనాడే దయచేసాడు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకములొ ఉన్నవాడి కంటే గొప్పవాడు, కాబట్టి మనకు ఎదురయ్యే సమస్యలను చూసి పారిపోనవసరం లేదు. ప్రార్ధన అనే అయుధాన్ని యేసయ్య మనకు దయచేసి ఉన్నాడు కాబట్టి, ప్రార్ధనలో ఒకరికొకరం ఏకీభవించి మన కొరకు, మన కుటుంబం కొరకు , తోటి సహోదరుల కొరకు, సంఘం కొరకు. సమస్త మానవాళి కొరకు ఎడతెగక ప్రార్ధించుదాం. ప్రార్ధన అనే డాలుతో, వాక్యం అనే ఖడ్గంతో సాతాను శోధనలను, అపవాది తలంపులను జయించుదాం. మనమూ మన కుటుంబాలు దేవునిలో నూరంతలుగా బలపడదాం.. ఆశీర్వదింపబడదాం. అమేన్.