December 25, 2020

హన్నా ప్రార్థన   (PRAYER OF HANNAH)

దేవునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలకు ఆమె ఓ ప్రతీక,  ప్రేమానురాగాలకు అతీతంగా దేవునికి ఇచ్చిన మాట కోసం తన కన్న బిడ్డను దేవునికి ప్రతిష్టించుకున్న ఘనత ఆమెది.  ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అనుకునే వారికి ఆమె ఒక మార్గదర్శి. ఇంతకీ ఆమె ఎవరో మీకు అర్ధం అయ్యిందా?  ఆమె మరేవరో కాదు.. హన్నా. హన్నాకు అందరిలాగే పెళ్ళి అయింది. హన్నా భర్త ఎఫ్రామీయుడైన ఎల్కానా. ఎల్కానా కు ఇద్దరు భార్యలు, రెండవ భార్య పేరుపెనిన్నా. పెనిన్నాకు సంతానం ఉంది, కాని హన్నాకు లేదు. బిడ్డలులేని లోటుతో పాటుగా పెనిన్నా ఎత్తిపొడుపులతో హన్నాకు అదనపు వేదన జతైంది. కాని కొంతలో కొంత సంతోషం ఏంటంటే,  హన్నా అంటే ఆమె భర్త ఎల్కానాకు ఎనలేని ప్రేమ, అభిమానం. ఎంత ప్రేమంటే  బిడ్డలు లేని హన్నాతో  ఆమె పెనిమిటి అయిన ఎల్కాన

హన్న,  నీవెందుకు ఎడ్చుచున్నావు? నీవు భోజనము  మానుట ఏలనీకు మనోవిచారము ఎందుకు కలిగినది? పదిమంది కుమాళ్ళ కంటె నేను నీకు విశేషమైనవాడను కానా ? అని ఆమెతో చెప్పుచూ వచ్చెను  (1 సమూయేలు 1-8)” .


 

ఓ మంచి స్నేహితుడిలా ఆమె భాధను పంచుకునే గొప్ప ప్రేమికుడు ఎల్కానా, భర్త ఎంత ఆప్యాయత చూయించినా ఆమె మనస్సులో ఉన్న వేదన, భాధ తీరేది కాదు కదా!  నాటి ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరంలాగా  ఆ సంవత్సరం కూడా  ఏల్కానా తన ఇద్దరు భార్యలైన హన్నా పెనిన్నా, ఆమె పిల్లలతో కలిసి కుటుంబం  అంతా యోహోవా  దేవునికి మ్రొక్కుబడులు చెల్లించడానికి  షిలోహు పట్టణానికి వస్తారు.  ఒక వైపు పెనిన్నా ఎత్తిపొడుపులు, మరోవైపు బిడ్డలు లేరనే భాధ, ఈ స్థితిలొ హన్నా యెహోవా దేవుని మందిరానికి  ఒంటరిగా వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. తను ఉన్న ఈ స్థితినితన వేదనను  ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని  దేవుని వేడుకొంటుంది.

సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక  జ్ఞాపకము   చేసికొనినీ సేవకురాలనైన నాకు ఒక మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదకి   క్షౌరపు కత్తి ఎన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు  అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను ( 1 సమూయేలు 1:11).  

హన్నా వేదనను చూచిన షిలోహు ఆలయం ప్రధాన  యాజకుడు ఏలి ఆమెను ఓదార్చి.. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెను ఆశీర్వదించి  పంపుతాడు.  

ఆ తరువాత హన్నా గర్భవతియై  కుమారునికి జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డకు హన్నా దంపతులు సమూయేలు అని పేరు పెట్టుకుంటారు. సమూయేలును పాలు మరిచే వరకు పెంచిన హన్నా ఆ తరువాత తానే సమూయేలును తీసుకొని తిరిగి షిలోహులోని దేవుని మందిరానికి వచ్చి బిడ్డను యాజకుడైన ఏలీకి అప్పగిస్తుంది. తాను దేవునికి మ్రొక్కుకున్న ప్రకారం మూడేళ్ళ తన ఒక్కగానొక్క బిడ్డను దేవునికి ప్రతిష్టితం చేస్తుంది.   హన్నా జీవితం ఎలా ప్రారంభం  అయినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా .. చివరకు తాను ఏ విధంగా జీవించాలని అనుకుందో ఆ విధంగానే తన జీవితాన్ని మలచుకోగలిగింది, దేవుని కృపను పొందుకోగలిగింది. 

హన్నా జీవితాన్ని గమనిస్తే మనకు 5 ముఖ్యమైన విషయాలు  కనిపిస్తాయి.  

1. తన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో గ్రహించి అక్కడకు చేరింది, దేవుని ప్రార్థించింది.  

2. తాను ఉన్న స్థితిని మార్చగలిగేవాడు,  యెహొవా దేవుడు ఒక్కడే అని పరిపూర్ణంగా విశ్వసించింది. 

3.  తన ప్రార్థనను దేవుడు ఆలకించాడని,  బిడ్డను తప్పక అనుగ్రహిస్తాడని నమ్మింది.

4.   తాను ప్రార్థనలో మ్రొక్కుకున్న దానికి కట్టుబడింది

5.   దేవుడు తన యెడల చేసిన కార్యాన్ని హన్నా బహుగా కీర్తించింది.

 

హన్నా ఏ విధంగ అయితే దేవుని యందు నమ్మికయుంచిందో మనమూ అదే నమ్మిక దేవునిపై ఉంచుదాం. దేవుని ప్రణాళికలను, ఆయన ఆలోచనలను  అంచనా వెయడం అన్ని సంధర్భాలలో మనకు సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి మన ప్రార్థనలకు  సమాధానం ఎందుకు అలస్యంగా వస్తాయో కూడా గ్రహించలేము. కానీ మనం చేసే ప్రార్ధనలు, కోరికలను దేవుడు మన జీవితాల్లో తగిన సమయంలో తప్పక నెరవేరుస్తాడనే నమ్మికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అవి కొంత ఆలస్యమైనప్పటికీ మన విశ్వాసం చెదిరిపోకూడదు,  మన నమ్మిక సడలిపోకూడదు. హన్నా ఏ విధంగ అయితే దేవునిపై భారం వేసి నిశ్చింతగ.. దేవుడు తన జీవితంలో తప్పక   కార్యం చేస్తాడనే గొప్ప నమ్మికతో తిరిగి తన ఇంటికి ఎలా వెళ్ళిందో.. మనమూ మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసంతో , నమ్మికతో జీవించాలి.

నీ సమస్త భారాన్ని మోయడానికి యేసయ్య నిన్ను రమ్మని అహ్వనిస్తున్నాడు. ఆయన  దయామయుడు, ప్రేమామయుడు , కరుణామయుడు కాబట్టి నిరంతరం నిన్ను హత్తుకొవడానికి, నీ కన్నీరుని తుడవడానికి, నీ సమస్యలను తీర్చి నిన్ను నూరంతలుగా ఫలింపచేయడనికి  నీ కొరకు వేచిచూస్తున్నాడు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నమ్మదగిన వాడు, హన్నాను అదరించిన దేవుడు నిన్నూ అదరిస్తాడు.  నీవు చేయవలసిందల్లా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని దరిచెరడమే.  సమస్యకు పరిష్కారం అలస్యం అవుతుందని ఆలోచించకు,  దేవునిలో రెట్టింపుగా ఆశీర్వదించబడుతున్నావని సంతోషించు. ఆమెన్.  

Dear Brothers and Sisters in Christ, If you like this post, kindly comment below the post and do share your response, Thank you for reading, God bless you abundantly, Yours HNTV Telugu Christian Channel

No comments:

Post a Comment

If you have any doubts, please let me know