మనష్షే మహారాజు
(MANASSEH THE SON OF HEZEKIAH)
యూదా దేశాన్ని విజయపథంలో నడిపించి దేవునికి విధేయుడుగా నిలిచిన హిజ్కియా మహారాజు మొదటి కుమారుడు మనష్షే మహారాజు . యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో 14 వ రాజు ఈ మనష్షే మహారాజు. మనష్షే అనే మాటకు మరిచిపోవడం అని అర్థం. ఈయన పరిపాలన, దుష్టబుద్ది, దేవుని యెడల అవిధేయత వలన దేవుడే ఈ మనష్షేను తన బిడ్డగ మరిచిపోయెంతగా దుష్టప్రవర్తన కలిగిన సార్ధకనామధేయుడు. 29 యేళ్ళపాటు యూదాదేశాన్ని పరిపాలించిన హిజ్కియా మరణానంతరం మనష్షే తన పన్నేండవయేటనే రాజుగా సింహసనాన్ని అదిష్టించి 55 సంవత్సరాలు సుదీర్ఘకాలం యూదా రాజ్యాన్ని పరిపాలించాడు.
2 రాజుల గ్రంథము 21:1-18 , 2 దినవృత్తాంతముల గ్రంథము 32:33
2 దినవృత్తాంతముల గ్రంథము 33:1-20
, యిర్మియా గ్రంథము 15:4
వ వచనంలలో మనష్షేను గురించిన సమాచారం మనకు లభిస్తుంది. ఇతన్ని యూదా
రాజులు అందరిలో కూడా బహు దుర్మార్గుడు అయిన పాలకుడిగా బైబిల్ పండితులు భావిస్తారు.
దేవునికి హేయమైన ప్రతిఒక్క కార్యాన్ని ఇతడు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. ఇతని పాలనలో తండ్రి హిజ్కియా పడగొట్టించిన బయలు దేవత విగ్రహాలను
తిరిగి నిర్మించి వాటికి బలిపీఠాలను కట్టాడు. యూదా ప్రజలలో విగ్రహారాధనను ప్రోత్సహించాడు. యెహోవా దేవున్ని కాక , ఆకాశ నక్షత్రాలను పూజించాడు. యెహోవా దేవుని మందిరములో అన్యదేవతల
బలిపీఠాలను నిర్మించాడు. చిల్లంగి,
సోదేగాండ్రతో సహవాసము చేసి వాటిని
ప్రొత్సహించాడు. చివరికి తన బిడ్డలను అగ్నిలోగుండ దాటేయటం వంటి దేవునికి అతి
హేయమైన కార్యాలను ఎన్నిటినో చేసాడు. యేరుషలేము ప్రజలు అన్యజనుల కంటే మరింత
అక్రమంగా ప్రవర్తించడానికి ఈ మనష్షేనే కారకుడు అయ్యాడు. తద్వారా సర్వాధికారి అయిన ఆ దేవాదిదేవుని
అగ్రహానికి గురయ్యాడు.
తన ప్రజలను తప్పు దారి పట్టిస్తూ తమ పితరులు ఎంతో భక్తితో సేవించి
తరించిన దేవాదిదేవుని మరిచిన మనష్షే ఎంతమాత్రం క్షమార్హుడు కాదుకదా. అయినా యెహోవా
దేవుడు తన జనుల ద్వార మనష్షేను హెచ్చరిస్తాడు. అతనిలో తగిన మార్పు రానందున దేవుడు
అష్హూరు రాజు సైన్యాన్ని వారిమీదకు రప్పిస్తాడు. దేవుని కృపకు దూరమైన మనష్షే అష్హూరు రాజు సైన్యాన్ని ఎదిరించి
నిలబడలేక లొంగిపోవలిసి వస్తుంది. అష్హూరు సైన్యం మనష్షేను గొలుసులతో బంధించి బబులోను రాజ్యానికి తరలించి చెరసాలలో బందిని
చేస్తారు . అప్రతిహాతంగా పరిపాలిస్తూ
అదంతా తన ప్రతిభే అని భ్రమించిన మనష్షే తాను దేవాలయాలు, బలిపీఠాలు నిర్మించి ఆరాధించిన ఏఒక్క దేవుడూ తాను ఉన్న ఈ స్థితి నుండి కాపాడి
రక్షించలేరని తేలుసుకోవడానికి ఆపై ఎంతో సమయం పట్టలేదు.
అన్యదేవతల విగ్రహాలను నిర్మించడానికి ఏ దేవుని ఆలయాలనైతే పాడుచేసాడో, జీవంలేని బయలును ఆశ్రయిస్తూ ఏ దేవుడినైతే తాను విడిచిపెట్టాడో ఆ ఒక్క జీవము గల దేవుడే సర్వశక్తిమంతుడని, లోకరక్షకుడని,
తానున్న ఈస్థితి నుండి తనను కాపాడి రక్షించగలవాడని ఆ వేదనకరమైన స్థితిలో మనష్షే
గ్రహించగలిగాడు. తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిని మొకాళ్ళు వంచి కన్నీటితో
ప్రార్ధించాడు. అతని
ప్రార్ధన అలకించిన కరుణామయుడైన దేవుడు మనష్షేను చరలో నుండి తప్పించటమే
కాకుండా తిరిగి తన దేశానికి పంపిస్తాడు. యూదా రాజుగా తన పూర్వవైభవాన్ని
పొందుకునేలా చేసాడు. యెహోవా దేవుడే నిజదేవుడని గ్రహించిన మనష్షే తాను
నిర్మించిన బయలు విగ్రహాలను, బలిపీఠాలను కూల్చివేసిన తరువాత , యెహోవా దేవుని ఆలయంలో యూదా జనాంగం తిరిగి భక్తి శ్రద్ధలతో బలులు సమర్పించటం ప్రారంభిస్తారు.
ఆ తరువాత మనష్షే మరి కొంతకాలం దేశాన్ని సుభిక్షిణ్ణంగా పరిపాలించి ప్రజల మేప్పును సంపాదించుకున్నాడు. మనష్షే మహారాజు జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నూతన నిబంధనలో యేసయ్య చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని పాత్రలా పాత నిబంధనలోని మనష్షేను కూడా చరిత్రకారులు తప్పిపొయిన కుమారుడిలా అభివర్ణిస్తారు. నిజంగానే తప్పిపొయిన కుమారునిలా కనిపించే మనష్షే జీవితం మనకందరికి ఒక గుణపాఠంలానే భావించాలి. ఈ మన జీవితం , సుఖసంతోషాలు, అస్థిపాస్థులు, అరోగ్యం అన్ని దేవుడు ఇచ్చినవే అని ఎప్పూడూ గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగిన దేవునికి విధేయులుగా జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే ఆ దేవాదిదేవుని అశీస్సులు మనకూ, మన కుటుంబాలకు సదాకాలము తోడైఉండి ముందుకు నడిపిస్తాయి. అట్టి గొప్ప దేవుని కృప మనందరికి సదాకాలము తోడై ఉండాలని నిత్యమూ ప్రార్థించుదాం. అమెన్.