May 18, 2023
January 11, 2023
ఈరోజు దేవుని వాగ్దానం 12.01.2023 TODAY GOD'S PROMISE
Today God's Promise
Watch and be blessed
#wordofgod #todaypromise #biblepromisetoday #anudinavagdanamu
February 15, 2021
యెఫ్తా (Jophthah)
యెఫ్తాని ఒక గొప్ప వీరునిగ మనం బైబిల్లో చూస్తాము. ఈ యెఫ్తా గురించి న్యాయధిపతులు గ్రంథము 11 వ అధ్యాయంలో వివరంగా ఉంటుంది. యెఫ్తా దేవునికి మంచి విశ్వాసపాత్రుడు. మనలో చాలా మందికి యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చారో లేదో అనే సందేహం ఉంటుంది. ఈ సందేహానికి సమాధానం కావాలంటే తప్పకుండా మనం యెఫ్తాగారి జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. యెఫ్తా ఇశ్రాయేలీయులకు 10వ న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు పనిచేసాడు. ఇతను గిలాదువాడు, యెఫ్తా తండ్రి పేరు కూడా గిలాదే. ఈ యెఫ్తా ఒక వేశ్య కుమారుడని బైబిల్ చెబుతుంది. గిలాదు భార్యకు జన్మించిన కుమారులు యెఫ్తాను అవమానించి తరిమివేస్తారు. అలా యెఫ్తా తన తండ్రి ఇంటి నుండి టోబు దేశానికి వెళ్లి అక్కడే నివసిస్తూ ఉంటాడు. అక్కడే వివాహం చేసుకుంటాడు, యెఫ్తా దంపతులకు ఒక పాప జన్మిస్తుంది. అలా కొంతకాలం గడిచిన తరువాత అమ్మోనియులు ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వస్తారు. వారిని ఎదుర్కొలేకపొయిన ఇశ్రాయేలీయులు యెఫ్తా వద్దకు వచ్చి అమ్మోనీయులతో యుద్దానికి ఇశ్రాయేలీయుల తరుపున సారధ్యం వహించమని అడుగుతారు, అందుకు ప్రతిఫలంగా తమ ఇశ్రాయేలు జనాంగానికి న్యాయధిపతిగా ఉండమని చెబుతారు. దీనికి యెఫ్తా సరే అని అంగీకరిస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం యెఫ్తా వారితో కలిసి గిలాదుకు తిరిగి వస్తాడు. ఆ తరువాత యెఫ్తా అమ్మోనీయులతో జరిపిన రాయభారం విఫలం అవుతుంది.
ఎప్పుడైతే
రాయభారం విఫలం అవుతుందో యెఫ్తా యెహోవా దేవుణ్ణి ప్రార్ధిస్తాడు, నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించిన యెడల నేను వారిపై విజయం
సాధించి తిరిగి వచ్చేప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చునదేదో
అది యెహోవాకు ప్రతిష్టితమగును, మరియు దహనబలిగా
దానిని అర్పిస్తానని యెహోవా దేవునికి మ్రొక్కుకుంటాడు. ఆ ప్రకారమే
యెఫ్తా ఇశ్రాయేలీయులకు నాయకత్వం
వహించి యెహోవా దేవుని దయతో అమ్మోనీయులను జయించి తిరిగి గిలాదుకు వస్తాడు, అతను ఇంటికి వచ్చే
సమయానికి యెఫ్తా కుమార్తె తన తండ్రి యుద్ధంలో
జయించి తిరిగి వస్తున్నాడన్న సంతోషంతో తంబుర వాయిస్తూ ఆనందంతో నాట్యం చేస్తూ యెఫ్తాకు ఎదురు
వస్తుంది. ఇది ఉహించని యెఫ్తా తీరని దుఃఖంతో
తన బట్టలు చించుకొని ఎంతగానో ఏడుస్తాడు.
తాను యుద్ధంలో
విజయం సాధించి తిరిగి వచ్చాక తన ఇంటి ద్వారం నుండి ఎవరు తనను ఎదుర్కొనడానికి
వచ్చునో దానిని దేవునికి ప్రతిష్టితము చేసి మరియు దహన బలిగ అర్పిస్తాను అని యెహోవాకు
మ్రొక్కుకొనిన విషయాన్ని గురించి తన ఒక్కగానొక్క
కుమార్తెకు చెప్పి రోధిస్తాడు. అంతేకాక
తాను దేవునికి మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి వెనుకకు తీయలేనని కూతురు ముందు
బాధపడతాడు. విషయం తెలుసుకున్న యెఫ్తా కుమార్తె, తండ్రి.. యెహోవాకు మాట ఇచ్చియుంటివా ... ఐతే
మ్రొక్కుప్రకారమే చేయండి. నన్ను నా
చెలికత్తెలను రెండు నెలలు విడువుము, నేను నా చెలికత్తెలు కొండల మీదనుండి నా
కన్యత్వమును గూర్చి ప్రలాపించెదనని ఆమె తన తండ్రితో అంటుంది. ఆపై రెండు నెలలు
ఆమె, ఆమె చెలికత్తెలు కొండలమీదికి పోయి తన కన్యత్వము గురించి ప్రలాపించి తిరిగి
తండ్రి దగ్గరకు వస్తుంది. తరువాత యెఫ్తా తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున
ఆమెకు చేసెను అని బైబిల్లో ఉంటుంది.
ఇంతకీ, ఆమె తిరిగి వచ్చిన తరువాత ఏమి జరిగింది, యెఫ్తా ఆమెను దేవునికి ప్రతిష్టించారా? దహనబలిగా సమర్పించారా అనేదీ… నేటికి ఎంతోమంది మదిలో మెదిలే
అంతుచిక్కని చిక్కు ప్రశ్న . ఇప్పుడు ఈ విషయం గురించి లోతుగా వాక్యాధారంగా
ధ్యానించుకుందాం.
నేనైతే యెహోవా
దేవునికి యెఫ్తా తన కుమార్తెను కేవలం
ప్రతిష్టించాడని.. దహనబలిగ అర్పించలేదని
నమ్ముతున్నాను. అందుకు సంబందించిన లేఖనభాగాలను పరిశుద్ధగ్రంథం సహాయంతో వివరించడానికి
ప్రయత్నిస్తాను.
1.
నరులను దహనబలిగ అర్పించుట దేవుని
దృష్టికి అతిహేయమైన చర్య
మొదటగా
ద్వితీయోపదేశకాండము 12:31 వ వచనంలో తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి
చేయవలదు, ఏలయనగ యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు
తమ దేవతల పేరిట తమ కుమారులను , తమ కుమార్తెలను అగ్ని హోత్రములో కాల్చివేయుదురు కదా.
ఈ వాక్యాన్ని
బట్టి మనుష్యులను దహనబలిగా
సమర్పించడం యెహోవా దేవుని దృష్టిలో అతిహేయమైన
చర్య, ఇందుకు మంచి ఉదాహరణ ఆనాడు అబ్రహాముతో యెహోవా దేవుడు ఇస్సాకును తనకు
అర్పించమని అడిగి అబ్రహాము యొక్క భయభక్తులను పరీక్షించాడే కాని దహనబలిని ఎంతమాత్రం ప్రోత్సహించలేదు, ఇస్సాకుకు బదులుగా అక్కడే పొదల్లో దహానబలిగా
అర్పించటానికి పొట్టేలును చూయించాడు.
అలాగే ఇక్కడ యెఫ్తా ఒక్కగానొక్క
కుమార్తెను దేవుడు తనకు దహనబలిగ కోరుకుంటాడని మనం ఎలా ఊహించగలం.
2. దేవుని ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు
యెఫ్తా మ్రొక్కుకున్నాడు
న్యాయాధిపతులు 11:29,30 వచనాలను గమనిస్తే .. యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగ
అతడు యెహోవాకు మ్రొక్కుకొనెను అని వ్రాయబడి ఉంది. అంటే దేవుని ఆత్మ
ప్రేరేపితమై యెఫ్తా ఈ విధంగా మ్రొక్కుకున్నాడని మనకు చాల స్పష్టంగా అర్ధం అవుతుంది.
కనానీయులు మనుష్యులను బలిగా ఇవ్వడం
అతిహేయమైన చర్యగా తెలిపిన దేవుడు, తాను ఇశ్రాయేలీయులకు అందించిన విజయానికి ప్రతిగా తన
ఒక్కగానొక్క బిడ్డను బలిగా ఇవ్వమని యెఫ్తాను
అడగడు కదా! అంటే దేవుని దృష్టిలో యెఫ్తా కుమార్తెకు
సంబంధించి ఒక ప్రణాళిక ఉంది, అందు నిమిత్తమే యెహోవా దేవుడు యెఫ్తాను
ఆత్మసంబంధితమై ప్రేరేపించాడు.
3. బిడ్డలను ప్రతిష్టకు, జంతువులను, పక్షులను బలి సమర్పణకు
లూకా సువార్త 2: 23,24 వ వచనాలలో యేసయ్య జన్మించిన తరువాత మరియ యేసేపు దంపతులు దేవునికి ప్రతిష్టించడానికి క్రీస్తును యేరుషలేము
దేవాలయానికి తీసుకొనివస్తారు. అదే సమయంలో ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా బలిగ
సమర్పించుటకు రెండు గువ్వల జతనైనను, రెండు పావురపు పిల్లలనైనను వారు తమతో పాటు తీసుకొనివచ్చినట్లుగా
చూస్తాం. అంటే ఈ వాక్యాలను బట్టి
ప్రతిష్టించుటకు బిడ్డలను, బలి అర్పణకు జంతువులను, పక్షులను
ఉపయోగించినట్లుగా స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇక యెఫ్తా
కుమార్తే విషయానికి వస్తే ఆమె యెఫ్తాకు ఏకైక కుమార్తె, పురుషుని ఎరుగని
కన్య, దేవుని యెడల భక్తి విశ్వాసాలు కలిగినది, తన తండ్రిని, అతను తీసుకునే
నిర్ణయాలని గౌరవించేదిగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. అందువలననే తండ్రి తన మ్రొక్కుబడి విషయం తెలుపగానే మారు మాట్లాడకుండ సరే అని అంటుంది. అలాగే తనకు రెండు నెలల సమయం ఇస్తే కొండలమీద ఉండి తన
కన్యత్వం గురించి ప్రలాపిస్తాను అని
తండ్రిని విడిచి కొండలకు వెళుతుంది. ఆ
తరువాత తాను చెప్పినట్లే ఆమె రెండు నెలల తరువాత తండ్రిని చేరుతుంది. పై విషయాలను
గమనిస్తే
1. నరులను దహనబలిగ అర్పించుట దేవుని దృష్టికి అతిహేయమైన చర్య (ద్వితీయోపదేశకాండము 12:31)
2. దేవుని ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు
యెఫ్తా మ్రొక్కుకున్నాడు
(న్యాయాధిపతులు 11:29,30)
, అంటే దేవుని దృష్టికి యెఫ్తా చేయవలిసిన కార్యము మంచి కార్యమే, యెఫ్తా కుమార్తెను దేవుడు తనకు ప్రతిష్ట చేయించదలిచాడు, అందుకే దేవుని ఆత్మ ప్రేరేపించగా యెఫ్తా ఈ విధంగా మ్రొక్కుకున్నాడు.
3. ఇశ్రాయేలీయుల సాంప్రదాయం ప్రకారం మనుష్యుల యొక్కయు, పశువుల యొక్కయు
తొలి సంతతిని దేవునికి ప్రతిస్టించాలి (నిర్గమకాండము 13:2). ఆ ప్రకారమే నాడు యేసయ్య పుట్టిన తరువాత అయనను యెరుషలేమునకు
తీసుకువచ్చి దేవునికి ప్రతిష్టించి బలిగా
జత గువ్వలనుగాని , జత పావురాలను గాని దేవునికి అర్పించారు.
నాడు పురుషులే కాదు , స్త్రీలు కూడా దేవునికి సేవ
చేసేవారు అని పలు లేఖనాలు మనకు చెబుతున్నాయి. నిర్గమకాండము 38:8 , 1 సమూయేలు 2:22,
సంఖ్యాకాండము 6 వ అధ్యాయములో పురుషుడు కానీ స్త్రీ కానీ నాజీరు వ్రతం చేయవచ్హని
చెబుతుంది, అందుకు కావలసిన అర్హతలను కూడా వివరిస్తుంది. యెఫ్తా కుమార్తెకు ఈ
అర్హతలన్నీ ఉన్నాయి
కాబట్టే
దేవుడు యెఫ్తాను తన అత్మ ద్వారా
ప్రేరేపించాడు. అతని కుమార్తెను బలపరిచాడు. రెండు నెలల తరువాత తిరిగి వచ్చిన తన
కుమార్తెను దేవునికి ప్రతిష్టించి జంతువులని బలి అర్పణ చేసాడని మనం భావించవచ్చు. అందువలనే
యెఫ్తా కుమార్తె అందించిన సేవలను బట్టి, ఆమెకు ఇశ్రాయేలు జనాంగములో ఉన్న పేరును
బట్టి, ఇశ్రాయేలీయుల కుమార్తెలు ప్రతి సంవత్సరం నాలుగు రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రసిద్ది చేస్తారు అని మనం
అనుకోవచ్చు.
అమ్మోనీయులను
గెలిచి, దేవుని జనాంగాన్ని
గెలిపించిన యెఫ్తా తను అన్న మాట ప్రకారం తన ఒక్కగానొక్క కుమార్తెను దేవునికి ప్రతిష్టించి దేవునికి ఇష్టునిగా నిలిచిపోయాడు, పరిశుద్ద గ్రంథంలో చోటు సంపాదించుకున్నాడు. నేటికి దేవుని
బిడ్డలచే కీర్తించబడుచున్నాడు. మనమూ.. దేవుని దృష్టిలో ఇష్టులుగా .. ఆయన వాక్యానుసారం
నడిచే బిడ్డలుగా ఈ లోకాన జీవించాలి. ఆ క్రమంలో కస్టాలు ఎదురైనా అవి చివరికి మన
జీవితాల్లో మంచినే మిగిల్చి దేవునిలో బహుగా ఫలించేలా చేస్తాయి. ఆయన బిడ్డలుగా
పరలోక వారసత్వాన్ని అందిస్తాయి.... ఆమెన్.
January 25, 2021
మనష్షే మహారాజు
(MANASSEH THE SON OF HEZEKIAH)
యూదా దేశాన్ని విజయపథంలో నడిపించి దేవునికి విధేయుడుగా నిలిచిన హిజ్కియా మహారాజు మొదటి కుమారుడు మనష్షే మహారాజు . యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో 14 వ రాజు ఈ మనష్షే మహారాజు. మనష్షే అనే మాటకు మరిచిపోవడం అని అర్థం. ఈయన పరిపాలన, దుష్టబుద్ది, దేవుని యెడల అవిధేయత వలన దేవుడే ఈ మనష్షేను తన బిడ్డగ మరిచిపోయెంతగా దుష్టప్రవర్తన కలిగిన సార్ధకనామధేయుడు. 29 యేళ్ళపాటు యూదాదేశాన్ని పరిపాలించిన హిజ్కియా మరణానంతరం మనష్షే తన పన్నేండవయేటనే రాజుగా సింహసనాన్ని అదిష్టించి 55 సంవత్సరాలు సుదీర్ఘకాలం యూదా రాజ్యాన్ని పరిపాలించాడు.
2 రాజుల గ్రంథము 21:1-18 , 2 దినవృత్తాంతముల గ్రంథము 32:33
2 దినవృత్తాంతముల గ్రంథము 33:1-20
, యిర్మియా గ్రంథము 15:4
వ వచనంలలో మనష్షేను గురించిన సమాచారం మనకు లభిస్తుంది. ఇతన్ని యూదా
రాజులు అందరిలో కూడా బహు దుర్మార్గుడు అయిన పాలకుడిగా బైబిల్ పండితులు భావిస్తారు.
దేవునికి హేయమైన ప్రతిఒక్క కార్యాన్ని ఇతడు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. ఇతని పాలనలో తండ్రి హిజ్కియా పడగొట్టించిన బయలు దేవత విగ్రహాలను
తిరిగి నిర్మించి వాటికి బలిపీఠాలను కట్టాడు. యూదా ప్రజలలో విగ్రహారాధనను ప్రోత్సహించాడు. యెహోవా దేవున్ని కాక , ఆకాశ నక్షత్రాలను పూజించాడు. యెహోవా దేవుని మందిరములో అన్యదేవతల
బలిపీఠాలను నిర్మించాడు. చిల్లంగి,
సోదేగాండ్రతో సహవాసము చేసి వాటిని
ప్రొత్సహించాడు. చివరికి తన బిడ్డలను అగ్నిలోగుండ దాటేయటం వంటి దేవునికి అతి
హేయమైన కార్యాలను ఎన్నిటినో చేసాడు. యేరుషలేము ప్రజలు అన్యజనుల కంటే మరింత
అక్రమంగా ప్రవర్తించడానికి ఈ మనష్షేనే కారకుడు అయ్యాడు. తద్వారా సర్వాధికారి అయిన ఆ దేవాదిదేవుని
అగ్రహానికి గురయ్యాడు.
తన ప్రజలను తప్పు దారి పట్టిస్తూ తమ పితరులు ఎంతో భక్తితో సేవించి
తరించిన దేవాదిదేవుని మరిచిన మనష్షే ఎంతమాత్రం క్షమార్హుడు కాదుకదా. అయినా యెహోవా
దేవుడు తన జనుల ద్వార మనష్షేను హెచ్చరిస్తాడు. అతనిలో తగిన మార్పు రానందున దేవుడు
అష్హూరు రాజు సైన్యాన్ని వారిమీదకు రప్పిస్తాడు. దేవుని కృపకు దూరమైన మనష్షే అష్హూరు రాజు సైన్యాన్ని ఎదిరించి
నిలబడలేక లొంగిపోవలిసి వస్తుంది. అష్హూరు సైన్యం మనష్షేను గొలుసులతో బంధించి బబులోను రాజ్యానికి తరలించి చెరసాలలో బందిని
చేస్తారు . అప్రతిహాతంగా పరిపాలిస్తూ
అదంతా తన ప్రతిభే అని భ్రమించిన మనష్షే తాను దేవాలయాలు, బలిపీఠాలు నిర్మించి ఆరాధించిన ఏఒక్క దేవుడూ తాను ఉన్న ఈ స్థితి నుండి కాపాడి
రక్షించలేరని తేలుసుకోవడానికి ఆపై ఎంతో సమయం పట్టలేదు.
అన్యదేవతల విగ్రహాలను నిర్మించడానికి ఏ దేవుని ఆలయాలనైతే పాడుచేసాడో, జీవంలేని బయలును ఆశ్రయిస్తూ ఏ దేవుడినైతే తాను విడిచిపెట్టాడో ఆ ఒక్క జీవము గల దేవుడే సర్వశక్తిమంతుడని, లోకరక్షకుడని,
తానున్న ఈస్థితి నుండి తనను కాపాడి రక్షించగలవాడని ఆ వేదనకరమైన స్థితిలో మనష్షే
గ్రహించగలిగాడు. తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిని మొకాళ్ళు వంచి కన్నీటితో
ప్రార్ధించాడు. అతని
ప్రార్ధన అలకించిన కరుణామయుడైన దేవుడు మనష్షేను చరలో నుండి తప్పించటమే
కాకుండా తిరిగి తన దేశానికి పంపిస్తాడు. యూదా రాజుగా తన పూర్వవైభవాన్ని
పొందుకునేలా చేసాడు. యెహోవా దేవుడే నిజదేవుడని గ్రహించిన మనష్షే తాను
నిర్మించిన బయలు విగ్రహాలను, బలిపీఠాలను కూల్చివేసిన తరువాత , యెహోవా దేవుని ఆలయంలో యూదా జనాంగం తిరిగి భక్తి శ్రద్ధలతో బలులు సమర్పించటం ప్రారంభిస్తారు.
ఆ తరువాత మనష్షే మరి కొంతకాలం దేశాన్ని సుభిక్షిణ్ణంగా పరిపాలించి ప్రజల మేప్పును సంపాదించుకున్నాడు. మనష్షే మహారాజు జీవితం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నూతన నిబంధనలో యేసయ్య చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని పాత్రలా పాత నిబంధనలోని మనష్షేను కూడా చరిత్రకారులు తప్పిపొయిన కుమారుడిలా అభివర్ణిస్తారు. నిజంగానే తప్పిపొయిన కుమారునిలా కనిపించే మనష్షే జీవితం మనకందరికి ఒక గుణపాఠంలానే భావించాలి. ఈ మన జీవితం , సుఖసంతోషాలు, అస్థిపాస్థులు, అరోగ్యం అన్ని దేవుడు ఇచ్చినవే అని ఎప్పూడూ గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగిన దేవునికి విధేయులుగా జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే ఆ దేవాదిదేవుని అశీస్సులు మనకూ, మన కుటుంబాలకు సదాకాలము తోడైఉండి ముందుకు నడిపిస్తాయి. అట్టి గొప్ప దేవుని కృప మనందరికి సదాకాలము తోడై ఉండాలని నిత్యమూ ప్రార్థించుదాం. అమెన్.
December 25, 2020
హన్నా ప్రార్థన (PRAYER OF HANNAH)
దేవునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలకు ఆమె ఓ ప్రతీక, ప్రేమానురాగాలకు అతీతంగా దేవునికి ఇచ్చిన మాట కోసం తన కన్న బిడ్డను దేవునికి ప్రతిష్టించుకున్న ఘనత ఆమెది. ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అనుకునే వారికి ఆమె ఒక మార్గదర్శి. ఇంతకీ ఆమె ఎవరో మీకు అర్ధం అయ్యిందా? ఆమె మరేవరో కాదు.. హన్నా. హన్నాకు అందరిలాగే పెళ్ళి అయింది. హన్నా భర్త ఎఫ్రామీయుడైన ఎల్కానా. ఎల్కానా కు ఇద్దరు భార్యలు, రెండవ భార్య పేరుపెనిన్నా. పెనిన్నాకు సంతానం ఉంది, కాని హన్నాకు లేదు. బిడ్డలులేని లోటుతో పాటుగా పెనిన్నా ఎత్తిపొడుపులతో హన్నాకు అదనపు వేదన జతైంది. కాని కొంతలో కొంత సంతోషం ఏంటంటే, హన్నా అంటే ఆమె భర్త ఎల్కానాకు ఎనలేని ప్రేమ, అభిమానం. ఎంత ప్రేమంటే బిడ్డలు లేని హన్నాతో ఆమె పెనిమిటి అయిన ఎల్కాన…
“హన్న, నీవెందుకు ఎడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనోవిచారము
ఎందుకు కలిగినది? పదిమంది కుమాళ్ళ కంటె నేను నీకు
విశేషమైనవాడను కానా ? అని ఆమెతో
చెప్పుచూ వచ్చెను (1 సమూయేలు 1-8)” .
ఓ మంచి స్నేహితుడిలా ఆమె భాధను
పంచుకునే గొప్ప ప్రేమికుడు ఎల్కానా, భర్త ఎంత ఆప్యాయత చూయించినా ఆమె మనస్సులో ఉన్న వేదన, భాధ తీరేది కాదు కదా! నాటి ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరంలాగా ఆ సంవత్సరం కూడా ఏల్కానా తన ఇద్దరు భార్యలైన హన్నా పెనిన్నా, ఆమె పిల్లలతో కలిసి కుటుంబం
అంతా యోహోవా దేవునికి
మ్రొక్కుబడులు చెల్లించడానికి షిలోహు
పట్టణానికి వస్తారు. ఒక వైపు పెనిన్నా
ఎత్తిపొడుపులు, మరోవైపు బిడ్డలు లేరనే భాధ, ఈ స్థితిలొ హన్నా యెహోవా దేవుని మందిరానికి ఒంటరిగా
వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. తను ఉన్న ఈ స్థితిని, తన వేదనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని వేడుకొంటుంది.
“సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు ఒక మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదకి క్షౌరపు కత్తి
ఎన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను ( 1
సమూయేలు 1:11)” .
హన్నా వేదనను చూచిన షిలోహు ఆలయం ప్రధాన యాజకుడు ఏలి ఆమెను ఓదార్చి.. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన
దయచేయును గాక అని ఆమెను ఆశీర్వదించి
పంపుతాడు.
ఆ తరువాత హన్నా గర్భవతియై కుమారునికి జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డకు హన్నా దంపతులు సమూయేలు అని పేరు పెట్టుకుంటారు. సమూయేలును పాలు మరిచే వరకు పెంచిన హన్నా ఆ తరువాత తానే సమూయేలును తీసుకొని తిరిగి షిలోహులోని దేవుని మందిరానికి వచ్చి బిడ్డను యాజకుడైన ఏలీకి అప్పగిస్తుంది. తాను దేవునికి మ్రొక్కుకున్న ప్రకారం మూడేళ్ళ తన ఒక్కగానొక్క బిడ్డను దేవునికి ప్రతిష్టితం చేస్తుంది. హన్నా జీవితం ఎలా ప్రారంభం అయినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా .. చివరకు తాను ఏ విధంగా జీవించాలని అనుకుందో ఆ విధంగానే తన జీవితాన్ని మలచుకోగలిగింది, దేవుని కృపను పొందుకోగలిగింది.
హన్నా జీవితాన్ని గమనిస్తే మనకు 5 ముఖ్యమైన
విషయాలు కనిపిస్తాయి.
1. తన సమస్యకు పరిష్కారం ఎక్కడ
దొరుకుతుందో గ్రహించి అక్కడకు చేరింది, దేవుని ప్రార్థించింది.
2. తాను ఉన్న స్థితిని మార్చగలిగేవాడు, యెహొవా దేవుడు ఒక్కడే అని పరిపూర్ణంగా
విశ్వసించింది.
3. తన ప్రార్థనను దేవుడు ఆలకించాడని, బిడ్డను తప్పక అనుగ్రహిస్తాడని నమ్మింది.
4. తాను ప్రార్థనలో మ్రొక్కుకున్న దానికి కట్టుబడింది
5. దేవుడు తన యెడల చేసిన కార్యాన్ని హన్నా
బహుగా కీర్తించింది.
హన్నా ఏ విధంగ అయితే దేవుని యందు
నమ్మికయుంచిందో మనమూ అదే నమ్మిక దేవునిపై ఉంచుదాం. దేవుని ప్రణాళికలను, ఆయన ఆలోచనలను అంచనా వెయడం
అన్ని సంధర్భాలలో మనకు సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి మన ప్రార్థనలకు సమాధానం ఎందుకు అలస్యంగా వస్తాయో కూడా
గ్రహించలేము. కానీ మనం చేసే ప్రార్ధనలు, కోరికలను దేవుడు మన జీవితాల్లో తగిన
సమయంలో తప్పక నెరవేరుస్తాడనే నమ్మికను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అవి కొంత ఆలస్యమైనప్పటికీ మన విశ్వాసం చెదిరిపోకూడదు, మన నమ్మిక సడలిపోకూడదు. హన్నా ఏ విధంగ అయితే
దేవునిపై భారం వేసి నిశ్చింతగ.. దేవుడు తన జీవితంలో తప్పక కార్యం చేస్తాడనే గొప్ప నమ్మికతో తిరిగి తన
ఇంటికి ఎలా వెళ్ళిందో.. మనమూ మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసంతో , నమ్మికతో జీవించాలి.
నీ సమస్త భారాన్ని మోయడానికి యేసయ్య నిన్ను రమ్మని అహ్వనిస్తున్నాడు. ఆయన దయామయుడు, ప్రేమామయుడు , కరుణామయుడు కాబట్టి నిరంతరం నిన్ను హత్తుకొవడానికి, నీ కన్నీరుని తుడవడానికి, నీ సమస్యలను తీర్చి నిన్ను నూరంతలుగా ఫలింపచేయడనికి నీ కొరకు వేచిచూస్తున్నాడు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నమ్మదగిన వాడు, హన్నాను అదరించిన దేవుడు నిన్నూ అదరిస్తాడు. నీవు చేయవలసిందల్లా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని దరిచెరడమే. సమస్యకు పరిష్కారం అలస్యం అవుతుందని ఆలోచించకు, దేవునిలో రెట్టింపుగా ఆశీర్వదించబడుతున్నావని సంతోషించు. ఆమెన్.
December 04, 2020
ఎలా ప్రార్ధించాలి? ( How to Pray ? )
ప్రార్థన
(prayer) దేవుడు మనకు ఇచ్చిన బలమైన సాధనం, ప్రార్థించడం ద్వారా
మనం మనకు కావలిసినవి పొందుకోవచ్చు,
నిరంతరం దేవునితో మనము బలమైన సంబంధాలు కలిగి
ఉండవచ్చు. మనల్ని మనం గెలుచుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు
తప్పకుండా మనం దేవుణ్ణి ప్రార్థించాలి. క్రైస్తవ జీవితాలలో ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆనాడు దావీదు మహారాజు క్రమం తప్పకుండా ప్రతిదినం 7
సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని స్వయంగా
చెప్పుకున్నాడు. దానియేలు ప్రవక్త కూడా రోజుకు మూడు సార్లు ప్రార్ధించాడు.
బైబిల్లో ఎంతో మంది ఎడతెగక దేవునికి ప్రార్థన చేసి తమకు కావలిసినవి పొందుకున్నారు. మనం కూడా ప్రార్థించాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు , తోటి సహొదరుల కొరకు, సంఘం కొరకు,
సమస్త మానవాళి కొరకు ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించే
విషయంలొ ఎలా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి,
ఎప్పుడు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థించాలి
అనే సందేహాలు చాలా వస్తాయి. ఆ సందేహాలకు సమాధానలను
ఇప్పుడు తెలుసుకుందాం.
1.
దేనికొరకు ప్రార్థించాలి ? (Why to Pray)
మనం దేవునితో మాట్లాడడం ఆయనకు ఎంతో ఇష్టం. మనం దేనికొరకైనా సరే దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అది పెద్ద విషయమా, చిన్న విషయమా అన్నది పెద్ద సమస్య కానేకాదు. ప్రార్థించడమే ముఖ్యం. ఆలా ప్రార్థిచడం ద్వారా తండ్రి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు.
2.
ఎప్పుడు, ఎక్కడ
దేవుణ్ణి ప్రార్థించాలి? ( when and where to Pray )
మనం దేవుణ్ణి ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. ఆయన నిత్యం మనలో, మనతొ పాటు ఉండేవాడు కాబట్టి దేవుని ప్రార్థించటానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక ప్రత్యేక సమయం అంటూ ఏమి లేదు. మనం ఎక్కడ ఉన్నా పర్లేదు దేవునితో చక్కగా మాట్లాడవచ్చు. మన సమస్యలని ప్రార్థన ద్వారా విన్నవించుకోవచ్చు.
3.
ప్రార్థన ఎంత సేపట్లొ ముగించాలి ? ( How much time to Pray )
మనం దేవునితో ప్రార్థనలో ఏకిభవించి
మట్లాడడమే చాలా ముఖ్యం. అది ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, లేదా ఒక రోజు
కావచ్చు . సమయం ఎంతైన పర్లేదు ఎంత సేపు ప్రార్థించాం అన్నది సమస్య
కానే కాదు. మనం ఎప్పుడు మాట్లాడినా,
ఎంత
సేపు మాట్లాడినా దేవుడు వింటాడు. తగిన సమయంలో సమాధానమూ ఇస్తాడు.
4 ఇతరులతో కలిసి ప్రార్థించవచ్చా? ( Can I pray with others? )
ప్రార్థించవచ్చు, ప్రార్థించాలి కూడా! అలా ఇతరులతో కలిసి ప్రార్థించడం ఎంతో మంచిది, స్నేహితులతో , ఇతరులతో కలిసి
ప్రార్థించడం వలన మీ స్నేహం ఇంకా బలంగా మారడమే గాక , దేవునిలో మీ విశ్వాసం మరింతగా
బలపడుతుంది. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో అక్కడ నేను ఉంటాను అని
యేసయ్య సెలవిచ్చాడు కదా.
కాబట్టి మనం ఎవరితో అయిన కలిసి దేవున్ని
ప్రార్థించవచ్చు.
4. ఎప్పుడూ చేతులు జోడించే ప్రార్ధించాలా? ( should I pray by joining Hands? )
చేతులు జోడించి, కన్నులు మూసి దేవుని ప్రార్థించడం ఒక మంచి అలవాటు, అలా ప్రార్థించడం వలన ఎకాగ్రత పెరుగుతుంది. తద్వారా మన మనస్సు మనం చేసే ప్రార్థన మీద లగ్నం అవుతుంది. అంతే కాదు మీరు ఎక్కడ ఏ పనిలొ ఉన్న మీకు అనుకూల సమయంలో మీ మనస్సులో మీరు మనసారా దేవుని ప్రార్థించవచ్చు, చేతులు జోడించి ప్రార్థించాల్సిన అవసరం లేదు.
5.
బిగ్గరగా ప్రార్థించవచ్చా ? ( Can I pray loudly)
బిగ్గరగా ప్రార్థించిన, లేక మనస్సులో మౌనంగా ప్రార్థించిన నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మనం బిగ్గరగా ప్రార్థించడం వలన మన మనస్సుకు మంచి ఎకాగ్రత కుదురుతుంది. నీవు ఉన్న చోటును బట్టి బిగ్గరగా గొంతెత్తి ప్రార్థించాలా , లేక మౌనంగానే మనస్సులో ప్రార్థించాలా అనేది నీ ఇష్టం. నీవు ఎలా ప్రార్థించినా నీ ప్రార్థన దేవుడు వింటాడు, తప్పకుండా జవాబు ఇస్తాడు.
ఈ 6 విధానాలను బట్టి మనం ప్రార్థన చేయడానికి, దేవునితో సంభాషించడానికి ఓ సమయమంటూ ప్రత్యేకంగా లేదు, ఇలా చేయాలి, అలా చెయ్యాలి అనే షరతులు కూడా లేవు. ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడటానికి ఏ షరతులూ విధించదు కదా. అలాగే ఒక తండ్రి తన బిడ్డల అలనా పాలనా విషయంలో ఎలాంటి సమయ సమయాలు చూడడు కదా. యేసయ్య మనకు అంతకంటే ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మనసారా దేవున్ని ప్రార్థించండి, సంభాషించండి, కావలసినవి పొందుకొండి. నిరంతరం దేవునిలో గడుపుతూ ఆయనకు ఇష్టులుగా జీవించండి. ఆమేన్.