February 15, 2021

యెఫ్తా (Jophthah)

యెఫ్తాని ఒక గొప్ప వీరునిగ మనం బైబిల్లో చూస్తాము. ఈ యెఫ్తా  గురించి న్యాయధిపతులు గ్రంథము 11 వ అధ్యాయంలో వివరంగా ఉంటుంది. యెఫ్తా దేవునికి మంచి విశ్వాసపాత్రుడు. మనలో చాలా మందికి యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చారో లేదో అనే సందేహం ఉంటుంది. ఈ సందేహానికి సమాధానం కావాలంటే తప్పకుండా మనం యెఫ్తాగారి జీవితాన్ని గురించి తెలుసుకోవాలి. యెఫ్తా ఇశ్రాయేలీయులకు 10వ న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు పనిచేసాడు. ఇతను గిలాదువాడు, యెఫ్తా తండ్రి పేరు కూడా గిలాదే. ఈ యెఫ్తా ఒక వేశ్య కుమారుడని బైబిల్ చెబుతుంది.  గిలాదు భార్యకు జన్మించిన కుమారులు యెఫ్తాను అవమానించి తరిమివేస్తారు. అలా యెఫ్తా తన తండ్రి ఇంటి నుండి టోబు దేశానికి వెళ్లి అక్కడే నివసిస్తూ ఉంటాడు. అక్కడే వివాహం చేసుకుంటాడు, యెఫ్తా దంపతులకు ఒక పాప జన్మిస్తుంది.  అలా కొంతకాలం గడిచిన తరువాత  అమ్మోనియులు ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వస్తారు. వారిని ఎదుర్కొలేకపొయిన ఇశ్రాయేలీయులు యెఫ్తా వద్దకు వచ్చి అమ్మోనీయులతో యుద్దానికి ఇశ్రాయేలీయుల తరుపున సారధ్యం వహించమని అడుగుతారు, అందుకు ప్రతిఫలంగా తమ ఇశ్రాయేలు జనాంగానికి న్యాయధిపతిగా ఉండమని చెబుతారు. దీనికి యెఫ్తా సరే అని అంగీకరిస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం యెఫ్తా వారితో కలిసి గిలాదుకు తిరిగి వస్తాడు. ఆ తరువాత యెఫ్తా అమ్మోనీయులతో జరిపిన రాయభారం విఫలం అవుతుంది.

       

ఎప్పుడైతే రాయభారం విఫలం అవుతుందో యెఫ్తా యెహోవా దేవుణ్ణి ప్రార్ధిస్తాడు, నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించిన యెడల నేను వారిపై విజయం సాధించి తిరిగి వచ్చేప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి  వచ్చునదేదో  అది యెహోవాకు ప్రతిష్టితమగును, మరియు దహనబలిగా దానిని అర్పిస్తానని యెహోవా దేవునికి మ్రొక్కుకుంటాడు.  ఆ ప్రకారమే   యెఫ్తా  ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించి యెహోవా దేవుని దయతో అమ్మోనీయులను జయించి తిరిగి గిలాదుకు వస్తాడు, అతను ఇంటికి వచ్చే సమయానికి  యెఫ్తా కుమార్తె తన తండ్రి యుద్ధంలో జయించి తిరిగి వస్తున్నాడన్న సంతోషంతో తంబుర వాయిస్తూ  ఆనందంతో నాట్యం చేస్తూ యెఫ్తాకు ఎదురు వస్తుంది. ఇది ఉహించని యెఫ్తా తీరని దుఃఖంతో  తన బట్టలు చించుకొని ఎంతగానో ఏడుస్తాడు.  

తాను యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చాక తన ఇంటి ద్వారం నుండి ఎవరు తనను ఎదుర్కొనడానికి వచ్చునో దానిని దేవునికి ప్రతిష్టితము చేసి మరియు దహన బలిగ అర్పిస్తాను అని యెహోవాకు మ్రొక్కుకొనిన విషయాన్ని గురించి తన ఒక్కగానొక్క  కుమార్తెకు చెప్పి  రోధిస్తాడు. అంతేకాక తాను దేవునికి మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి వెనుకకు తీయలేనని కూతురు ముందు బాధపడతాడు. విషయం తెలుసుకున్న యెఫ్తా కుమార్తె,   తండ్రి.. యెహోవాకు మాట ఇచ్చియుంటివా ... ఐతే మ్రొక్కుప్రకారమే చేయండి. నన్ను నా  చెలికత్తెలను రెండు నెలలు విడువుము, నేను నా చెలికత్తెలు కొండల మీదనుండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించెదనని ఆమె తన తండ్రితో అంటుంది. ఆపై రెండు నెలలు ఆమె, ఆమె చెలికత్తెలు కొండలమీదికి పోయి తన కన్యత్వము గురించి ప్రలాపించి తిరిగి తండ్రి దగ్గరకు వస్తుంది. తరువాత యెఫ్తా తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అని బైబిల్లో ఉంటుంది. 

ఇంతకీ,  ఆమె తిరిగి వచ్చిన తరువాత ఏమి జరిగింది, యెఫ్తా ఆమెను దేవునికి ప్రతిష్టించారా? దహనబలిగా సమర్పించారా  అనేదీ నేటికి ఎంతోమంది మదిలో మెదిలే అంతుచిక్కని చిక్కు ప్రశ్న . ఇప్పుడు ఈ విషయం గురించి లోతుగా వాక్యాధారంగా ధ్యానించుకుందాం.

నేనైతే యెహోవా దేవునికి యెఫ్తా తన కుమార్తెను  కేవలం ప్రతిష్టించాడని.. దహనబలిగ  అర్పించలేదని నమ్ముతున్నాను.   అందుకు సంబందించిన  లేఖనభాగాలను పరిశుద్ధగ్రంథం సహాయంతో వివరించడానికి ప్రయత్నిస్తాను.      


1.    నరులను దహనబలిగ అర్పించుట దేవుని దృష్టికి అతిహేయమైన చర్య  

మొదటగా ద్వితీయోపదేశకాండము 12:31 వ వచనంలో తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగ యెహోవా ద్వేషించు  ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను , తమ కుమార్తెలను అగ్ని హోత్రములో కాల్చివేయుదురు కదా.

ఈ వాక్యాన్ని బట్టి మనుష్యులను దహనబలిగా సమర్పించడం యెహోవా దేవుని దృష్టిలో అతిహేయమైన చర్య, ఇందుకు మంచి ఉదాహరణ ఆనాడు అబ్రహాముతో యెహోవా దేవుడు ఇస్సాకును తనకు అర్పించమని అడిగి అబ్రహాము యొక్క భయభక్తులను  పరీక్షించాడే కాని దహనబలిని ఎంతమాత్రం ప్రోత్సహించలేదు, ఇస్సాకుకు  బదులుగా అక్కడే పొదల్లో దహానబలిగా అర్పించటానికి పొట్టేలును చూయించాడు.  అలాగే ఇక్కడ యెఫ్తా  ఒక్కగానొక్క కుమార్తెను దేవుడు తనకు దహనబలిగ కోరుకుంటాడని మనం ఎలా ఊహించగలం.

 

2. దేవుని ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు యెఫ్తా మ్రొక్కుకున్నాడు

  న్యాయాధిపతులు 11:29,30 వచనాలను గమనిస్తే .. యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగ అతడు యెహోవాకు మ్రొక్కుకొనెను అని వ్రాయబడి ఉంది. అంటే దేవుని ఆత్మ ప్రేరేపితమై  యెఫ్తా ఈ విధంగా మ్రొక్కుకున్నాడని మనకు చాల స్పష్టంగా అర్ధం అవుతుంది. కనానీయులు మనుష్యులను బలిగా  ఇవ్వడం అతిహేయమైన చర్యగా తెలిపిన దేవుడు, తాను ఇశ్రాయేలీయులకు అందించిన విజయానికి ప్రతిగా తన ఒక్కగానొక్క   బిడ్డను బలిగా ఇవ్వమని యెఫ్తాను అడగడు కదా! అంటే దేవుని దృష్టిలో  యెఫ్తా కుమార్తెకు సంబంధించి ఒక ప్రణాళిక ఉంది, అందు నిమిత్తమే యెహోవా దేవుడు యెఫ్తాను ఆత్మసంబంధితమై  ప్రేరేపించాడు.    

 

3. బిడ్డలను ప్రతిష్టకు, జంతువులను, పక్షులను బలి సమర్పణకు

లూకా సువార్త 2: 23,24 వ వచనాలలో యేసయ్య జన్మించిన తరువాత మరియ యేసేపు దంపతులు దేవునికి ప్రతిష్టించడానికి  క్రీస్తును యేరుషలేము దేవాలయానికి తీసుకొనివస్తారు. అదే సమయంలో ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా బలిగ సమర్పించుటకు రెండు గువ్వల జతనైనను, రెండు పావురపు పిల్లలనైనను వారు తమతో పాటు తీసుకొనివచ్చినట్లుగా చూస్తాం. అంటే ఈ వాక్యాలను బట్టి ప్రతిష్టించుటకు  బిడ్డలను, బలి అర్పణకు జంతువులను, పక్షులను ఉపయోగించినట్లుగా స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.

 

ఇక యెఫ్తా కుమార్తే విషయానికి వస్తే ఆమె యెఫ్తాకు ఏకైక కుమార్తె, పురుషుని ఎరుగని కన్య, దేవుని యెడల భక్తి విశ్వాసాలు కలిగినది, తన తండ్రిని, అతను తీసుకునే నిర్ణయాలని గౌరవించేదిగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. అందువలననే తండ్రి తన మ్రొక్కుబడి విషయం తెలుపగానే మారు మాట్లాడకుండ సరే అని అంటుంది. అలాగే తనకు రెండు నెలల సమయం ఇస్తే కొండలమీద ఉండి తన కన్యత్వం గురించి  ప్రలాపిస్తాను అని తండ్రిని విడిచి  కొండలకు వెళుతుంది. ఆ తరువాత  తాను చెప్పినట్లే  ఆమె రెండు నెలల తరువాత తండ్రిని చేరుతుంది.  పై   విషయాలను గమనిస్తే   

1.       నరులను దహనబలిగ అర్పించుట దేవుని దృష్టికి అతిహేయమైన చర్య   (ద్వితీయోపదేశకాండము 12:31)

2.        దేవుని ఆత్మ తన మీదికి వచ్చినప్పుడు యెఫ్తా మ్రొక్కుకున్నాడు  (న్యాయాధిపతులు 11:29,30)  , అంటే దేవుని దృష్టికి  యెఫ్తా చేయవలిసిన కార్యము మంచి కార్యమే, యెఫ్తా కుమార్తెను దేవుడు తనకు ప్రతిష్ట చేయించదలిచాడు, అందుకే దేవుని ఆత్మ ప్రేరేపించగా యెఫ్తా ఈ విధంగా మ్రొక్కుకున్నాడు.

3.       ఇశ్రాయేలీయుల సాంప్రదాయం ప్రకారం మనుష్యుల యొక్కయు, పశువుల యొక్కయు తొలి సంతతిని దేవునికి ప్రతిస్టించాలి (నిర్గమకాండము 13:2). ఆ ప్రకారమే నాడు యేసయ్య పుట్టిన తరువాత అయనను యెరుషలేమునకు తీసుకువచ్చి  దేవునికి ప్రతిష్టించి బలిగా జత గువ్వలనుగాని , జత పావురాలను గాని దేవునికి అర్పించారు.

నాడు పురుషులే కాదు , స్త్రీలు కూడా  దేవునికి సేవ చేసేవారు అని పలు లేఖనాలు మనకు చెబుతున్నాయి. నిర్గమకాండము 38:8 , 1 సమూయేలు 2:22,  సంఖ్యాకాండము 6 వ అధ్యాయములో పురుషుడు కానీ స్త్రీ కానీ నాజీరు వ్రతం చేయవచ్హని చెబుతుంది, అందుకు కావలసిన అర్హతలను కూడా వివరిస్తుంది. యెఫ్తా కుమార్తెకు ఈ అర్హతలన్నీ ఉన్నాయి  కాబట్టే    దేవుడు యెఫ్తాను తన అత్మ ద్వారా ప్రేరేపించాడు. అతని కుమార్తెను బలపరిచాడు. రెండు నెలల తరువాత తిరిగి వచ్చిన తన కుమార్తెను దేవునికి ప్రతిష్టించి జంతువులని బలి అర్పణ చేసాడని మనం భావించవచ్చు. అందువలనే యెఫ్తా కుమార్తె అందించిన సేవలను బట్టి, ఆమెకు ఇశ్రాయేలు జనాంగములో ఉన్న పేరును బట్టి, ఇశ్రాయేలీయుల కుమార్తెలు ప్రతి సంవత్సరం నాలుగు రోజులు  జ్ఞాపకం చేసుకుంటూ ప్రసిద్ది చేస్తారు అని మనం అనుకోవచ్చు.   

 

అమ్మోనీయులను గెలిచి,  దేవుని జనాంగాన్ని గెలిపించిన యెఫ్తా తను అన్న మాట ప్రకారం తన ఒక్కగానొక్క కుమార్తెను  దేవునికి ప్రతిష్టించి  దేవునికి ఇష్టునిగా  నిలిచిపోయాడు, పరిశుద్ద గ్రంథంలో  చోటు సంపాదించుకున్నాడు. నేటికి దేవుని బిడ్డలచే కీర్తించబడుచున్నాడు. మనమూ.. దేవుని దృష్టిలో ఇష్టులుగా .. ఆయన వాక్యానుసారం నడిచే బిడ్డలుగా ఈ లోకాన జీవించాలి. ఆ క్రమంలో కస్టాలు ఎదురైనా అవి చివరికి మన జీవితాల్లో మంచినే మిగిల్చి దేవునిలో బహుగా ఫలించేలా చేస్తాయి. ఆయన బిడ్డలుగా పరలోక వారసత్వాన్ని అందిస్తాయి.... ఆమెన్.  

 

 



Dear Brothers and Sisters in Christ, If you like this post, kindly comment below the post and do share your response, Thank you for reading, God bless you abundantly, Yours HNTV Telugu Christian Channel