Monday, April 15, 2019

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు

యేసయ్య ఈ భూమ్మీద గడిపిన 33 1/2 ఏళ్లలో 3 1/2 ఏళ్ళు ఆయన రక్షణ సువార్తను లోకానికి అందించాడు,  ఆయన ఈ లోకంలో నడయాడిన ప్రతిదినమూ మనకు సుదినమే. అయినా ఆయన కల్వరిలో సిలువపై మరణించబోయే ముందు గడిపిన చివరి వారం రోజులు మరింత ప్రాముఖ్యమైనవి. ఆ వారం రోజుల్లో తానేరీతిగా మరణించబోతున్నదీ, ఎవరిద్వారా అప్పగింపబడబోతున్నదీ, శిష్యులు ఆయన అనంతరం ఎలా జీవించాలి వంటి ఎన్నో అద్భుతమైన మర్మాలు ఆ ఏడు రోజుల్లో మనకు కనిపిస్తాయి. వాటిని ఏరోజు కారోజు మీకు వివరించాలనే ప్రయత్నం చేసాము.  

యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు
మొదటిరోజు - శనివారం
ఆ రోజు బెతానియా లోని సీమోను ఇంట్లో మరియ యేసయ్య పాదాలను కడగడంతో ఆయన చివరి దినాలు ప్రారంభం అయ్యాయని అనుకోవచ్చు. త్వరలో జరుగబోయే భూస్థాపనకు ఇది నాంది అంటూ యెసయ్యే స్వయంగా చెప్పడంతో ఈ రోజు ప్రారంభం అవుతుంది. 
*శనివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:* 
https://youtu.be/cfGO0MLDYg0 

 https://youtu.be/cfGO0MLDYg0


రెండవరోజు - ఆదివారం
ఆదివారం గాడిదపిల్లను అధిరోహించి జనులు హోసన్నా అంటూ జేజేలు పలుకుతుండగా యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. కట్టబడిన గాడిదనూ గాడిదపిల్లనూ వాటి కట్లు విప్పించబడటంలోనూ.. గాడిదపిల్లను అధిరోహించి రావడం లోనూ గొప్ప నిఘూడమైన మర్మాలు అందులో దాగివున్నాయి.  
*ఆదివారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/Gh9dOnAxx-A మూడవరోజు - సోమవారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వస్తాడు. అక్కడ వర్తక వ్యాపారుల ఆగడాలు చూసిన యేసు హృదయం తల్లడిల్లిపోతుంది. వ్యాపారుల బల్లలను పడవేసి బంధించిన పావురాలను, కోడెలను, మేకలను వాటి కట్లు తెంపి వాటికి వదిలివేస్తాడు. వాటి కట్లు తెంపి విడుదలను చేయడంలో చాలా బలమైన కారణం ఉంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి
*సోమవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :* 
https://youtu.be/RpzSrkQIf8E నాల్గవ రోజు - మంగళ వారం
ఆ రోజు యేసు యెరుషలేము దేవాలయానికి వచ్చి అక్కడ శిష్యులకు ఇంకా జనాంగానికి దేవుని గురించి బోధిస్తాడు. ఇక్కడ బోధిచడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? అంటూ నిలదీసిన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యలకు యేసయ్య తనదైన శైలిలో ఉపమానాల ద్వారా తగిన సమాధానం చెబుతాడు. అంతే కాక తనకు విధించబోయే శిక్షను గురించి.. తన మరణాన్ని గురించి పరోక్షంగా శిష్యులకు, జనాంగానికి బోధిస్తాడు. 
*మంగళ వారం  వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి :*
https://youtu.be/s8E4PZVVRiY  ఐదవ రోజు - బుధవారం
ఆ రోజు యూదా ఇస్కరియోతు క్రీస్తును అప్పగించడానికి ప్రధాన యాజకులతో కలిసి పన్నాగం పన్నడం,ముప్పై వెండినాణేలకు అమ్ముకోవడం గురించి శుక్రవారం జరుగబోయే దారుణాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు చెబుతాడు,అసలు యూదా ఏసయ్యను పట్టించడంలో చంపాలనే ఆలోచనతోనే పట్టించాడా?, యూదా మనసులో ఏముంది? అసలు యూదా ఆలా ఎందుకు చేశాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
*బుధవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/NaZDGodT8D8 ఆరవరోజు - గురువారం
గురువారం యేసుక్రీస్తు జీవితంలో కీలకమైన రోజు. ఆ రోజు యేసు అత్యంత పవిత్రమైన బల్ల ఆరాధనను మనకు అందించాడు, మనం ఎలా జీవించాలో మాదిరిగా చూయించాడు. మనలనూ అలానే జీవించమని ఆశీర్వదించాడు. మన కొరకు మన పాపపంకిలమైన జీవితాల కొరకు క్రీస్తు మరణం వైపు అడుగులు వేస్తూ మనకు రక్షణను అందించడానికి దుర్మార్గులకు తనను తాను అప్పగించుకున్నాడు. 
*గురువారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/pPp6rJWiCSo ఏడవ రోజు - శుక్రవారం GOOD FRIDAY 
శుక్రవారం.. క్రైస్తవులకు పవిత్రమైన రోజు, మన పాపాలనుండి దైవకుమారుడు మనకు విముక్తిని అందించిన రోజు. శుభ శుక్రవారంగా ప్రపంచమంతటా పండుగలు జరుపుకునే రోజు. మనుష్యకుమారునిగా జన్మించిన యేసుకు ఈ భూమ్మీద చివరి రోజు. అలాంటి శుక్రవారాన్ని గూర్చి నేడు మనం మరోమారు ధ్యానించడం ఆ దేవుని కృప మాత్రమే. 
*శుక్రవారం వీడియోని చూడడానికి ఈ లింకుని క్లిక్ చేయండి:*
https://youtu.be/fFaw1gEqND4 యేసు ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు  ఈ ఎపిసోడ్ తో పూర్తి అయ్యాయి. దేవుని మహాకృప వలన ఈ వీడియోలను మీకు మన HOPE Nireekshana TV ద్వారా అందిచగలిగాము. భవిష్యత్తులో మరిన్ని సందర్భాలలో మనం కలిసి ఆ తండ్రిని ధ్యానించుకోవాలని.. అట్టి భాగ్యాన్ని మనకు దయచేయాలని ఆ ప్రభువుని ప్రార్ధిద్దాము. 
తప్పక ఈ వీడియోలను చూచి మీ కామెంట్లను బాక్స్ లో వ్రాయగలరు. ఈ వీడియోలు మీకు నచ్చితే మరచిపోకుండా షేర్ చేయగలరు, ఆమెన్. 
యేసయ్య ఈ భూమ్మీద గడిపిన చివరి వారం రోజులు

Tuesday, April 9, 2019

ఆమేన్ అంటే!? - AMEN STORY - ఆమేన్ అని ఎందుకు అనాలి?

ఆమేన్ అని ఎందుకు అనాలి ?

ఆమేన్ అనగానే అన్ని జరిగిపోతాయా ?

క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నిత్యం మనం చేసే ప్రతి ప్రార్ధనా ముగింపులో నజరేయుడైన యేసు నామంలో ప్రార్ధిస్తున్నాము తండ్రీ అని ముగిస్తాము. మనం ఎందుకు అలా ప్రార్ధన ముగింపులో ఆమెన్ అని అంటాము. అలా అనడంలో ఐదైనా అంతరార్ధం ఉందా?

యేసు నామములో కార్యములు జరుగును గాక అని అనగానే నిజంగానే జరుగవలసిన ప్రతికార్యమూ నెరవేరుతుందా! బైబిల్ గ్రంధంలో అలా నెరవేరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలను గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాము,

ఈ ఆమెన్ అనే మాట హీబ్రు పదమైన ఆమాను అనే పదం నుండి వచ్చింది. ఆమెన్ అనే మాటకు అలాగే జరుగును గాక అని అర్ధం. ప్రకటనల గ్రంధం 3:14 వ వచనంలో యేసును ఆమెన్ అనువాడుగా యోహాను ప్రవక్త ప్రవచిస్తాడు. అంటే యేసయ్య మనం చేసే ప్రార్థనలకు, విన్నపాలకూ నిత్యం ఆమెన్ అనువాడుగా ఉన్నట్టుగా మనం ఈ వాక్యంలో గమనించవచ్చు.

ఇశ్రాయేలు దేశ ప్రజలు నేటికీ శనివారం నాడు సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరిస్తారు. వారు ప్రతి సబ్బాతు దినాన ఉదయాన్నే పరలోకం నుండి క్రుమ్మరింపబడే దీవెనలను పొందుకోవడానికి ఒక చోట చేరి ఆ దీవెనలను ఆమెన్ అని అంటూ పొందుకుంటారు.

1 పేతురు 3 :10 వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని వ్రాయబడి ఉంటుంది. అంటే క్రీస్తును అనుసరించే మనం మన నాలుకను పెదవులను మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనల్ని మనము నిందించుకోవడం కానీ, ఇతరులను నిందించడం కానీ చేయకూడదు. తద్వారా మన శాపాలు మనమే కొనితెచ్చుకున్నవారం అవుతాము. ఎందుకంటే శాపాలు కొనితెచ్చుకునేవారం మనమైతే, ఆశీర్వాదాలు దయచేసేవాడు మన తండ్రి ఐన యేసయ్య, అది ఎలాగంటే..

ద్వితీయోపదేశకాండము 27 :15 వ వచనం నుండి చివరి వచనం వరకు శాపాలు పట్టిక ఉంటుంది, ప్రతి వచనాన్ని చివరిలో ఆమెన్ అని చెప్పవలెనని ఉంటుంది. అదే రీతిగా ద్వితీయోపదేశకాండము 28 :1 -14 వ వచనం వరకు ఆశీర్వచనాలు పట్టిక ఉంటుంది. కానీ ఏ ఒక్క వచనం కూడా చివర ఆమెన్ అనే మాటతో ముగియదు. ఇందులో మర్మమేమిటో మనం తెలుసుకోవాలంటే 2 కొరింథీ 1 :20 వ వచనం చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, గనుక మనద్వారా  దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి (మూల భాషలో ఆమెన్ అని యున్నవి} అని ఉంటుంది. అంటే మనకు వచ్చిన, రావలసిన ఆశీర్వాదాలన్నీ క్రీస్తు నామములో నిశ్చయములై ఉన్నవే అనే కదా అర్ధం.

ఆమెన్ అని ఎందుకు అనాలో తెలుసుకుందాం!

యేసు అనగా రక్షకుడు అని అర్ధం. మనల్ని మన పాపాలనుండి, శాపాలనుండి రక్షించువాడు ఆయనే. మనం మన ప్రార్ధనలో చివరిగా యేసు నామములో ప్రార్ధిస్తున్నాము అని అనగానే మన యొక్క పాపాలు, శాపాలు, రోగాలు తొలగిపోతున్నాయంటే అదంతా కేవలం దేవుని మహా కృపే. పాప రహితుడైన ఆయన నామానికి గల శక్తి. మనం మన మిత్రులకొరకు, కుటుంబ సభ్యులకొరకు, సంఘము కొరకు, దేశము కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రార్ధిస్తూ ఆయా ఇబ్బందులనుండి విడుదల పొందుకొంటున్నామంటే అది కేవలం దేవుని మహిమార్థమే జరుగుతుంది. 

మనం ఎప్పుడు ఎక్కడ ప్రార్ధన చేసినా.. యేసయ్య మనతో పాటు అక్కడ ఉన్నట్టే. మనతో పాటుగా వుండి మన ప్రార్ధనా విన్నపాలు విని అంగీకారయుక్తమైన మన ప్రార్ధనను ఆలకించి ఆమెన్ అని అనినట్టే కదా!

బాలుడైన దావీదు గొల్యాతును ఎదుర్కొనబోయే ముందు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని నామములో పోరాడటానికి వెళ్ళాడు. కాబట్టే చిన్నవాడైన దావీదు ఆజానుబాహుడు బహుపరాక్రమవంతుడైన గొల్యాతును అవలీలగా మట్టి కరిపించాడు.

అంతేకాదు, ఆనాడు సమాజమందిరపు అధికారి అయిన యాయీరు, యేసయ్య తప్పక తన ప్రార్ధన ఆలకిస్తాడనే గొప్ప విశ్వాసంతో ఆమెన్ అని ప్రార్ధించి తండ్రి మహా కృపను బట్టి తన పాపను బ్రతికించుకున్నాడు. అదేవిధంగా షూనేమీయురాలు కూడా అదే విశ్వాసంతో ఎలీషా ప్రవక్త ద్వారా ఆమెన్ అంటూ తన బిడ్డను తిరిగి బ్రతికించుకోగలిగింది. అంటే తల్లితండ్రులు, పెద్దలు కూడా  గొప్ప విశ్వాసంతో తమ బిడ్డలా పక్షాన నిలబడి ఆమెన్ అని తండ్రిని ప్రార్ధించాలి.

తీవ్ర రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే గొప్ప విశ్వాసంతో యేసయ్య అంగీ అంచును తాకి స్వస్థతను పొందుకుందో, అదే విశ్వాసంతో మనమూ.. మన పక్షాన, పిల్లల పక్షాన క్రీస్తునందు నమ్మికతో ప్రార్ధించి మనకు కావలసిన వాటిని గురించి తండ్రిని ప్రార్ధిస్తూ.. నీ చిత్తమైతే మేము కోరుకున్నవాటిని ఫలింపచేయమని వేడుకుంటూ .. ప్రార్ధన ముగింపులో ఆమెన్ అని ప్రార్ధిస్తే  ఆ ప్రార్ధన తప్పక ఫలిస్తుంది, మన కుటుంబాలు కూడా యేసుక్రీస్తులో గొప్పగా ఫలిస్తాయి.

ఆమెన్ అనే మాటలో ఎంత గొప్ప శక్తి దాగివుందో చూసారా? మనం చేసే ప్రార్ధనలో నమ్మిక, పొందుకోగలమన్న విశ్వాసం గనుక మనకుంటే ఆమెన్ అని అనడానికి మన తండ్రి నిరంతరం సిద్దంగానే ఉన్నాడు. నీకొరకు నాకొరకు ఏనాడో ఆయన తన ప్రణాళికను రచించాడు, మంచి భవిష్యత్తును సిద్ధపరచాడు. మరి ప్రార్ధించి పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఆలోచించు, నమ్మికతో ప్రార్ధించు, పొందుకోవడానికి సిద్దపడు. ఆమెన్ అని అనడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, ఆమెన్.  

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

Wednesday, April 3, 2019

WOMAN, BE HOLD YOUR SON || 7 WORDS ON THE CROSS || UNBELIEVABLE BIBLE FACTS

యేసు క్రీస్తు తన అమ్మను అలా ఎందుకు పిలిచాడు !?

SEVEN WORDS ON THE CROSS

భాష ఏదైనా అమ్మను మనం పిలిచే పిలుపులో ఎంతో ప్రేమ, మాధుర్యం దాగి ఉంటాయి. ఏ బిడ్డ అయినా అమ్మను అమ్మ అనే పిలుస్తాడు. అనుకోకుండా ఎదురైన ఆపదలో సైతం ప్రతి ఒక్కరు అమ్మనే స్మరించుకుంటారు. కానీ అమ్మను అమ్మ అని కాకుండా స్త్రీ అని కానీ, మహిళా అనికానీ మనం పిలువగలమా? అంతటి కఠిన హృదయాన్ని ఎవరైనా కలిగి ఉంటారా? కనీసం అలాంటి సందర్భాలనైనా మనం ఊహించగలమా...?

ఊహించాలి తప్పదు..! ఎందుకంటే సాక్షాత్తుగా ఆ దేవాదిదేవుడే ఈ ఇలలో కారణభూతునిగా జన్మించడానికి ఒక ధన్యజీవిని ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఏ పాపమూ అంటకుండా ఈ భూమిపై జన్మించాడు, సకల జగత్తుకు రక్షణ భాగ్యాన్ని అందించాడు.

లోకానికి ప్రేమించడం నేర్పిన ఆ కరుణామయుడే సాక్షాత్తు తన తల్లిని అమ్మ అని కాక పరాయి స్త్రీని పిలిచినట్లుగా స్త్రీ అని పిలవడమేమిటి?  అవును..! తెలుగు తమిళ మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో యేసుక్రీస్తు తల్లి మరియను అమ్మా అని సంబోధించినట్లుగా బైబిల్లో చూస్తాము. కానీ మూలభాష నుండి తర్జుమా చేయబడిన ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం మరియను స్త్రీ లేదా ఇంగ్లీష్ లో woman అని పిలిచినట్లుగా చూస్తాము. అంటే ప్రాంతీయ భాషల్లో ఉన్నట్లుగా అమ్మా అని కాక యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియను స్త్రీ అని సంబోధించాడు. అన్నీ ఎరిగిన ఆ దేవాదిదేవుడే తన తల్లిని అలా ఎందుకు పిలిచాడు? చాలా లోతుగా ఆలోచించవలసిన ప్రశ్న ఇది!

తన మూడున్నర ఏళ్ళ పరిచర్యతో మొత్తం ప్రపంచానికి క్రైస్తవాన్ని, అందులో ఇమిడియున్న ప్రేమను పంచిన ఆ పరమ పునీతునికి ఆ మాత్రం తెలియదా? మహా పండితులను సైతం 12 ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా? మరి ఎందుకు అలా అమ్మను అమ్మా అని పిలువక.. ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు! ఈ విషయాన్ని గురించి కాస్త లోతుగా చర్చిద్దాం.

పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ లేదా woman అని సంబోధించడం మన చూస్తాం. మొదటి సందర్భం కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు కాగా, రెండవసారి సిలువమ్రానుపై వేదన అనుభవిస్తూ అక్కడే ఉన్న యోహానును తన తల్లి మరియ బాధ్యతను అప్పగిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు.

యేసుక్రీస్తు తన ఆధ్యాత్మిక జీవితకాలంలో కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలకు అతీతంగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు. ఆయన జీవితంలోని కొన్ని సందర్భాలను గనుక మనం పరిశీలిస్తే 

ఒకసారి యేసుక్రీస్తు కొంతమంది జనులతో కలిసిఉన్నప్పుడు తల్లి ఐన మరియ ఇంకా ఆయన సోదరులు క్రీస్తును కలవడానికి వస్తారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు వచ్చి యేసు చెబుతారు. అందుకు ఆయన నా తల్లి, సహోదరులు ఎవరు? ఇదిగో నా తల్లి సహోదరులు అంటూ తన చుట్టూ కూర్చున్న వారిని చూయిస్తాడు. అంటే యేసుక్రీస్తు భౌతికమైన బాంధవ్యాలకంటే తండ్రి తనకు అప్పగించిన ఏ పనిమీద ఐతే వచ్చాడో.. ఆ పనికి సంబంధించిన ఆత్మీయ, దైవికమైన సంబంధాలపైనే ఆయన తన దృష్టిని నిలిపాడని మనం అనుకోవాలి.

అదేవిధంగా యేసు 12 ఏళ్ళ ప్రాయంలో పస్కా పండుగ నాడు మరియ దంపతులు యేసును తీసుకుని యెరూషలేము దేవాలయానికి వస్తారు. కానీ తిరిగి వెళ్లేప్పుడు యేసుక్రీస్తు తమతో తిరిగి రాకపోవడం గమనించిన ఆ దంపతులు తిరిగి దేవాలయానికి వచ్చి యేసును గురించి వెదుకుతారు. అక్కడ వేద పండితులతో యేసు దైవికమైన అంశాలను చర్చిస్తూ వారికి కనిపిస్తాడు. యేసు కనిపించక కంగారుపడుతున్న తన తల్లి తండ్రులతో యేసు మీరెలా నన్ను వెదుకుచున్నారు? నేను నాతండ్రి పనులమీద ఉండవలెనని మీరెరుగరా అని ఆ దంపతులతో ఖరాఖండిగా చెప్పడం మనం లూకా గ్రంధము 2:41:49 వచనాలలో చూడవచ్చు. 

అంతేకాక లూకా గ్రంధము 14: 26 వ వచనంలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు. 27 వ వచనంలో ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు అని కూడా చాలా స్పష్టంగా చెబుతాడు.

అంటే శిష్యులుగా తనను వెంబడింపదలచిన వారు అన్ని బంధకాలను త్రెంచుకొని ఆయన బిడ్డలుగా తండ్రిని చేరుకోవాలి అని ఈ వచనాల్లో మనకు చాలా సూటిగా చెబుతున్నాడు. ఈ రెండు వచనాలు ప్రకారం ప్రభువు మనకు చెప్పేది మనల్ని మన తల్లితండ్రులకు బంధువులకు భార్యా బిడ్డలకు దూరంగా ఉండమని కాదు, అంతకంటే మిన్నగా దేవునియందు మన దృష్టిని లగ్నం చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉండవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే జన్మనిచ్చిన అమ్మను అమ్మ అని అనడంలో ఇవేమి అడ్డుకాదు కదా! అమ్మను అమ్మా అని పిలవడంతో ఇబ్బంది ఏముంది? అనే ప్రశ్న మనలో తప్పక తలెత్తుతుంది.

ఇందుకు సమాధానం మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు అందరిలా పాపములో జన్మించలేదు.ఆయన పుట్టుకకు కన్య మరియను ఒక పాత్రనుగా ఆ తండ్రి తయారుచేసుకున్నాడు. ఈ లోకంలోని ప్రతివారినీ జన్మించక మునుపే ఆయన ఎరిగియున్న రీతిగా మరియను కూడా ఆమె పుట్టకమునుపే ఆయన ఎరిగియున్నాడు. ఆమెను కూడా తన అరచేతులపై చెక్కుకుని యున్నాడు. మరియ యేసుకు ఈ లోకంలో జన్మనీయక మునుపే యేసయ్య   మరియకు తండ్రియై జన్మనిచ్చాడు.

అంతేకాక పుట్టుకతో మనమందరమూ పాపులమే, యేసయ్యకు జన్మనిచ్చిన మరియతో సహా. కానీ క్రీస్తు మహా పరిశుద్ధుడు, ఏ పాపమూ అంటని వాడు, కాబట్టే ఆయన తన తల్లిని అమ్మా అని సంబోధించి ఉండకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. 

అలాగే క్రీస్తు మరియను స్త్రీ లేదా woman అని పిలవడాన్ని గురించి బైబిల్ పండితులు మరో వాదన కూడా చేస్తారు, అదేంటంటే ఆదికాండము 3:15 లో తెలిపిన విధంగా నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తలమీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ వాక్యాన్ని అనుసరించి దేవుడు సృష్టించిన మొదటి స్త్రీ (woman) అవ్వ కాగా దేవునిచే ఎన్నుకోబడి, ఈ భూమ్మీద సాతాను తలమీద కొట్టి తనకు పుట్టబోయే మహాదేవుని ద్వారా ఈ సకల మానవాళికి రక్షణ అందించిన ఆ మాతృమూర్తిని నూతన స్త్రీ (new woman) గా ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికే యేసయ్య తన తల్లిని స్త్రీ అని సంబోధించి ఎనలేని గౌరవాన్ని అందించాడని అంటారు. 

చివరిగా తన ప్రియ శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పిన విధానాన్ని బట్టి మరియ కేవలం తనకు మాత్రమే తల్లి కాదు, నీకూ తల్లే.. అదేవిధంగా తనను ప్రేమించి ఆరాధించే ఈ సకల మానవాళికీ మరియ మాతృమూర్తి అని పరిచయం చేసి తాను పలికిన చివరి ఏడు మాటల్లో ఒక మాటగా ఆ తల్లికి క్రైస్తవ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని అందించాడు. నిరంతరం ఓ ప్రేమామయిగా, మాతృమూర్తిగా మన మనస్సులో నిలిచి ఉండేలా మన హృదయాల్లో చెరగని ముద్రను వేసాడు కరుణామయుడైన ఆ పరమతండ్రి. ఆమెన్.

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.