April 03, 2019

WOMAN, BE HOLD YOUR SON || 7 WORDS ON THE CROSS || UNBELIEVABLE BIBLE FACTS

యేసు క్రీస్తు తన అమ్మను అలా ఎందుకు పిలిచాడు !?

SEVEN WORDS ON THE CROSS

భాష ఏదైనా అమ్మను మనం పిలిచే పిలుపులో ఎంతో ప్రేమ, మాధుర్యం దాగి ఉంటాయి. ఏ బిడ్డ అయినా అమ్మను అమ్మ అనే పిలుస్తాడు. అనుకోకుండా ఎదురైన ఆపదలో సైతం ప్రతి ఒక్కరు అమ్మనే స్మరించుకుంటారు. కానీ అమ్మను అమ్మ అని కాకుండా స్త్రీ అని కానీ, మహిళా అనికానీ మనం పిలువగలమా? అంతటి కఠిన హృదయాన్ని ఎవరైనా కలిగి ఉంటారా? కనీసం అలాంటి సందర్భాలనైనా మనం ఊహించగలమా...?

ఊహించాలి తప్పదు..! ఎందుకంటే సాక్షాత్తుగా ఆ దేవాదిదేవుడే ఈ ఇలలో కారణభూతునిగా జన్మించడానికి ఒక ధన్యజీవిని ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఏ పాపమూ అంటకుండా ఈ భూమిపై జన్మించాడు, సకల జగత్తుకు రక్షణ భాగ్యాన్ని అందించాడు.

లోకానికి ప్రేమించడం నేర్పిన ఆ కరుణామయుడే సాక్షాత్తు తన తల్లిని అమ్మ అని కాక పరాయి స్త్రీని పిలిచినట్లుగా స్త్రీ అని పిలవడమేమిటి?  అవును..! తెలుగు తమిళ మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో యేసుక్రీస్తు తల్లి మరియను అమ్మా అని సంబోధించినట్లుగా బైబిల్లో చూస్తాము. కానీ మూలభాష నుండి తర్జుమా చేయబడిన ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం మరియను స్త్రీ లేదా ఇంగ్లీష్ లో woman అని పిలిచినట్లుగా చూస్తాము. అంటే ప్రాంతీయ భాషల్లో ఉన్నట్లుగా అమ్మా అని కాక యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియను స్త్రీ అని సంబోధించాడు. అన్నీ ఎరిగిన ఆ దేవాదిదేవుడే తన తల్లిని అలా ఎందుకు పిలిచాడు? చాలా లోతుగా ఆలోచించవలసిన ప్రశ్న ఇది!

తన మూడున్నర ఏళ్ళ పరిచర్యతో మొత్తం ప్రపంచానికి క్రైస్తవాన్ని, అందులో ఇమిడియున్న ప్రేమను పంచిన ఆ పరమ పునీతునికి ఆ మాత్రం తెలియదా? మహా పండితులను సైతం 12 ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా? మరి ఎందుకు అలా అమ్మను అమ్మా అని పిలువక.. ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు! ఈ విషయాన్ని గురించి కాస్త లోతుగా చర్చిద్దాం.

పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ లేదా woman అని సంబోధించడం మన చూస్తాం. మొదటి సందర్భం కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు కాగా, రెండవసారి సిలువమ్రానుపై వేదన అనుభవిస్తూ అక్కడే ఉన్న యోహానును తన తల్లి మరియ బాధ్యతను అప్పగిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు.

యేసుక్రీస్తు తన ఆధ్యాత్మిక జీవితకాలంలో కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలకు అతీతంగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు. ఆయన జీవితంలోని కొన్ని సందర్భాలను గనుక మనం పరిశీలిస్తే 

ఒకసారి యేసుక్రీస్తు కొంతమంది జనులతో కలిసిఉన్నప్పుడు తల్లి ఐన మరియ ఇంకా ఆయన సోదరులు క్రీస్తును కలవడానికి వస్తారు. ఈ విషయాన్ని ఆయన శిష్యులు వచ్చి యేసు చెబుతారు. అందుకు ఆయన నా తల్లి, సహోదరులు ఎవరు? ఇదిగో నా తల్లి సహోదరులు అంటూ తన చుట్టూ కూర్చున్న వారిని చూయిస్తాడు. అంటే యేసుక్రీస్తు భౌతికమైన బాంధవ్యాలకంటే తండ్రి తనకు అప్పగించిన ఏ పనిమీద ఐతే వచ్చాడో.. ఆ పనికి సంబంధించిన ఆత్మీయ, దైవికమైన సంబంధాలపైనే ఆయన తన దృష్టిని నిలిపాడని మనం అనుకోవాలి.

అదేవిధంగా యేసు 12 ఏళ్ళ ప్రాయంలో పస్కా పండుగ నాడు మరియ దంపతులు యేసును తీసుకుని యెరూషలేము దేవాలయానికి వస్తారు. కానీ తిరిగి వెళ్లేప్పుడు యేసుక్రీస్తు తమతో తిరిగి రాకపోవడం గమనించిన ఆ దంపతులు తిరిగి దేవాలయానికి వచ్చి యేసును గురించి వెదుకుతారు. అక్కడ వేద పండితులతో యేసు దైవికమైన అంశాలను చర్చిస్తూ వారికి కనిపిస్తాడు. యేసు కనిపించక కంగారుపడుతున్న తన తల్లి తండ్రులతో యేసు మీరెలా నన్ను వెదుకుచున్నారు? నేను నాతండ్రి పనులమీద ఉండవలెనని మీరెరుగరా అని ఆ దంపతులతో ఖరాఖండిగా చెప్పడం మనం లూకా గ్రంధము 2:41:49 వచనాలలో చూడవచ్చు. 

అంతేకాక లూకా గ్రంధము 14: 26 వ వచనంలో ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని అంటాడు. 27 వ వచనంలో ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు అని కూడా చాలా స్పష్టంగా చెబుతాడు.

అంటే శిష్యులుగా తనను వెంబడింపదలచిన వారు అన్ని బంధకాలను త్రెంచుకొని ఆయన బిడ్డలుగా తండ్రిని చేరుకోవాలి అని ఈ వచనాల్లో మనకు చాలా సూటిగా చెబుతున్నాడు. ఈ రెండు వచనాలు ప్రకారం ప్రభువు మనకు చెప్పేది మనల్ని మన తల్లితండ్రులకు బంధువులకు భార్యా బిడ్డలకు దూరంగా ఉండమని కాదు, అంతకంటే మిన్నగా దేవునియందు మన దృష్టిని లగ్నం చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉండవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే జన్మనిచ్చిన అమ్మను అమ్మ అని అనడంలో ఇవేమి అడ్డుకాదు కదా! అమ్మను అమ్మా అని పిలవడంతో ఇబ్బంది ఏముంది? అనే ప్రశ్న మనలో తప్పక తలెత్తుతుంది.

ఇందుకు సమాధానం మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు అందరిలా పాపములో జన్మించలేదు.ఆయన పుట్టుకకు కన్య మరియను ఒక పాత్రనుగా ఆ తండ్రి తయారుచేసుకున్నాడు. ఈ లోకంలోని ప్రతివారినీ జన్మించక మునుపే ఆయన ఎరిగియున్న రీతిగా మరియను కూడా ఆమె పుట్టకమునుపే ఆయన ఎరిగియున్నాడు. ఆమెను కూడా తన అరచేతులపై చెక్కుకుని యున్నాడు. మరియ యేసుకు ఈ లోకంలో జన్మనీయక మునుపే యేసయ్య   మరియకు తండ్రియై జన్మనిచ్చాడు.

అంతేకాక పుట్టుకతో మనమందరమూ పాపులమే, యేసయ్యకు జన్మనిచ్చిన మరియతో సహా. కానీ క్రీస్తు మహా పరిశుద్ధుడు, ఏ పాపమూ అంటని వాడు, కాబట్టే ఆయన తన తల్లిని అమ్మా అని సంబోధించి ఉండకపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. 

అలాగే క్రీస్తు మరియను స్త్రీ లేదా woman అని పిలవడాన్ని గురించి బైబిల్ పండితులు మరో వాదన కూడా చేస్తారు, అదేంటంటే ఆదికాండము 3:15 లో తెలిపిన విధంగా నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తలమీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ వాక్యాన్ని అనుసరించి దేవుడు సృష్టించిన మొదటి స్త్రీ (woman) అవ్వ కాగా దేవునిచే ఎన్నుకోబడి, ఈ భూమ్మీద సాతాను తలమీద కొట్టి తనకు పుట్టబోయే మహాదేవుని ద్వారా ఈ సకల మానవాళికి రక్షణ అందించిన ఆ మాతృమూర్తిని నూతన స్త్రీ (new woman) గా ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికే యేసయ్య తన తల్లిని స్త్రీ అని సంబోధించి ఎనలేని గౌరవాన్ని అందించాడని అంటారు. 

చివరిగా తన ప్రియ శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పిన విధానాన్ని బట్టి మరియ కేవలం తనకు మాత్రమే తల్లి కాదు, నీకూ తల్లే.. అదేవిధంగా తనను ప్రేమించి ఆరాధించే ఈ సకల మానవాళికీ మరియ మాతృమూర్తి అని పరిచయం చేసి తాను పలికిన చివరి ఏడు మాటల్లో ఒక మాటగా ఆ తల్లికి క్రైస్తవ ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని అందించాడు. నిరంతరం ఓ ప్రేమామయిగా, మాతృమూర్తిగా మన మనస్సులో నిలిచి ఉండేలా మన హృదయాల్లో చెరగని ముద్రను వేసాడు కరుణామయుడైన ఆ పరమతండ్రి. ఆమెన్.

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know