April 10, 2019

ఆమేన్ అంటే!? - AMEN STORY - ఆమేన్ అని ఎందుకు అనాలి?

ఆమేన్ అని ఎందుకు అనాలి ?

ఆమేన్ అనగానే అన్ని జరిగిపోతాయా ?

క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నిత్యం మనం చేసే ప్రతి ప్రార్ధనా ముగింపులో నజరేయుడైన యేసు నామంలో ప్రార్ధిస్తున్నాము తండ్రీ అని ముగిస్తాము. మనం ఎందుకు అలా ప్రార్ధన ముగింపులో ఆమెన్ అని అంటాము. అలా అనడంలో ఐదైనా అంతరార్ధం ఉందా?

యేసు నామములో కార్యములు జరుగును గాక అని అనగానే నిజంగానే జరుగవలసిన ప్రతికార్యమూ నెరవేరుతుందా! బైబిల్ గ్రంధంలో అలా నెరవేరిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలను గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాము,

ఈ ఆమెన్ అనే మాట హీబ్రు పదమైన ఆమాను అనే పదం నుండి వచ్చింది. ఆమెన్ అనే మాటకు అలాగే జరుగును గాక అని అర్ధం. ప్రకటనల గ్రంధం 3:14 వ వచనంలో యేసును ఆమెన్ అనువాడుగా యోహాను ప్రవక్త ప్రవచిస్తాడు. అంటే యేసయ్య మనం చేసే ప్రార్థనలకు, విన్నపాలకూ నిత్యం ఆమెన్ అనువాడుగా ఉన్నట్టుగా మనం ఈ వాక్యంలో గమనించవచ్చు.

ఇశ్రాయేలు దేశ ప్రజలు నేటికీ శనివారం నాడు సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరిస్తారు. వారు ప్రతి సబ్బాతు దినాన ఉదయాన్నే పరలోకం నుండి క్రుమ్మరింపబడే దీవెనలను పొందుకోవడానికి ఒక చోట చేరి ఆ దీవెనలను ఆమెన్ అని అంటూ పొందుకుంటారు.

1 పేతురు 3 :10 వ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని వ్రాయబడి ఉంటుంది. అంటే క్రీస్తును అనుసరించే మనం మన నాలుకను పెదవులను మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనల్ని మనము నిందించుకోవడం కానీ, ఇతరులను నిందించడం కానీ చేయకూడదు. తద్వారా మన శాపాలు మనమే కొనితెచ్చుకున్నవారం అవుతాము. ఎందుకంటే శాపాలు కొనితెచ్చుకునేవారం మనమైతే, ఆశీర్వాదాలు దయచేసేవాడు మన తండ్రి ఐన యేసయ్య, అది ఎలాగంటే..

ద్వితీయోపదేశకాండము 27 :15 వ వచనం నుండి చివరి వచనం వరకు శాపాలు పట్టిక ఉంటుంది, ప్రతి వచనాన్ని చివరిలో ఆమెన్ అని చెప్పవలెనని ఉంటుంది. అదే రీతిగా ద్వితీయోపదేశకాండము 28 :1 -14 వ వచనం వరకు ఆశీర్వచనాలు పట్టిక ఉంటుంది. కానీ ఏ ఒక్క వచనం కూడా చివర ఆమెన్ అనే మాటతో ముగియదు. ఇందులో మర్మమేమిటో మనం తెలుసుకోవాలంటే 2 కొరింథీ 1 :20 వ వచనం చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, గనుక మనద్వారా  దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి (మూల భాషలో ఆమెన్ అని యున్నవి} అని ఉంటుంది. అంటే మనకు వచ్చిన, రావలసిన ఆశీర్వాదాలన్నీ క్రీస్తు నామములో నిశ్చయములై ఉన్నవే అనే కదా అర్ధం.

ఆమెన్ అని ఎందుకు అనాలో తెలుసుకుందాం!

యేసు అనగా రక్షకుడు అని అర్ధం. మనల్ని మన పాపాలనుండి, శాపాలనుండి రక్షించువాడు ఆయనే. మనం మన ప్రార్ధనలో చివరిగా యేసు నామములో ప్రార్ధిస్తున్నాము అని అనగానే మన యొక్క పాపాలు, శాపాలు, రోగాలు తొలగిపోతున్నాయంటే అదంతా కేవలం దేవుని మహా కృపే. పాప రహితుడైన ఆయన నామానికి గల శక్తి. మనం మన మిత్రులకొరకు, కుటుంబ సభ్యులకొరకు, సంఘము కొరకు, దేశము కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రార్ధిస్తూ ఆయా ఇబ్బందులనుండి విడుదల పొందుకొంటున్నామంటే అది కేవలం దేవుని మహిమార్థమే జరుగుతుంది. 

మనం ఎప్పుడు ఎక్కడ ప్రార్ధన చేసినా.. యేసయ్య మనతో పాటు అక్కడ ఉన్నట్టే. మనతో పాటుగా వుండి మన ప్రార్ధనా విన్నపాలు విని అంగీకారయుక్తమైన మన ప్రార్ధనను ఆలకించి ఆమెన్ అని అనినట్టే కదా!

బాలుడైన దావీదు గొల్యాతును ఎదుర్కొనబోయే ముందు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని నామములో పోరాడటానికి వెళ్ళాడు. కాబట్టే చిన్నవాడైన దావీదు ఆజానుబాహుడు బహుపరాక్రమవంతుడైన గొల్యాతును అవలీలగా మట్టి కరిపించాడు.

అంతేకాదు, ఆనాడు సమాజమందిరపు అధికారి అయిన యాయీరు, యేసయ్య తప్పక తన ప్రార్ధన ఆలకిస్తాడనే గొప్ప విశ్వాసంతో ఆమెన్ అని ప్రార్ధించి తండ్రి మహా కృపను బట్టి తన పాపను బ్రతికించుకున్నాడు. అదేవిధంగా షూనేమీయురాలు కూడా అదే విశ్వాసంతో ఎలీషా ప్రవక్త ద్వారా ఆమెన్ అంటూ తన బిడ్డను తిరిగి బ్రతికించుకోగలిగింది. అంటే తల్లితండ్రులు, పెద్దలు కూడా  గొప్ప విశ్వాసంతో తమ బిడ్డలా పక్షాన నిలబడి ఆమెన్ అని తండ్రిని ప్రార్ధించాలి.

తీవ్ర రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే గొప్ప విశ్వాసంతో యేసయ్య అంగీ అంచును తాకి స్వస్థతను పొందుకుందో, అదే విశ్వాసంతో మనమూ.. మన పక్షాన, పిల్లల పక్షాన క్రీస్తునందు నమ్మికతో ప్రార్ధించి మనకు కావలసిన వాటిని గురించి తండ్రిని ప్రార్ధిస్తూ.. నీ చిత్తమైతే మేము కోరుకున్నవాటిని ఫలింపచేయమని వేడుకుంటూ .. ప్రార్ధన ముగింపులో ఆమెన్ అని ప్రార్ధిస్తే  ఆ ప్రార్ధన తప్పక ఫలిస్తుంది, మన కుటుంబాలు కూడా యేసుక్రీస్తులో గొప్పగా ఫలిస్తాయి.

ఆమెన్ అనే మాటలో ఎంత గొప్ప శక్తి దాగివుందో చూసారా? మనం చేసే ప్రార్ధనలో నమ్మిక, పొందుకోగలమన్న విశ్వాసం గనుక మనకుంటే ఆమెన్ అని అనడానికి మన తండ్రి నిరంతరం సిద్దంగానే ఉన్నాడు. నీకొరకు నాకొరకు ఏనాడో ఆయన తన ప్రణాళికను రచించాడు, మంచి భవిష్యత్తును సిద్ధపరచాడు. మరి ప్రార్ధించి పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఆలోచించు, నమ్మికతో ప్రార్ధించు, పొందుకోవడానికి సిద్దపడు. ఆమెన్ అని అనడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, ఆమెన్.  

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know