March 30, 2019

క్రీస్తుద్వారా విమోచన పొందిన గాడిదపిల్ల

గాడిదలా జీవించు...

పరిశుద్ధ గ్రంధం చెబుతున్న అద్భుతకరమైన 3 విషయాలు

బైబిల్లో చాలా సందర్భాలలో గాడిదకు సంబందించిన ప్రస్తావన వస్తుంది.  దేవుడు తన పరిశుద్ధ గ్రంధములో గాడిదకు, గాడిదపిల్లకు ప్రత్యేకమైన స్థానాన్ని అనుగ్రహించాడు అని చెప్పవచ్చు.

దావీదుకు ఆహారాన్ని మోసినా, కరువుకాలంలో యేసేపు తన తండ్రి కుటుంబానికి మూటలకొద్దీ ధాన్యాన్ని ఐగుప్తునుండి తరలించినా, యెహోవా దేవుని దూతనుచూచి బిలామును హెచ్చరించినా, ఇవన్నీ గాడిదకు మాత్రమే సాధ్యపడ్డాయి.

అంతేకాదు గాడిద పచ్చి దవడ ఎముకతో ఆనాడు సమ్సోను వెయ్యిమందిని అవలీలగా అంతమొందించాడంటే అది ఎవరికీ సాధ్యం? అలాగే దావీదు, ఆయన కుమారుడైన సాలొమోను ఇంకా అనేకమంది ప్రవక్తలు గుర్రాలను కాకుండా గాడిదలనే తమ వాహనాలుగా ఎంచుకున్నట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే పరమ పునీతుడు, పదివేలమందిలో అతిసుందరుడైన మన యేసుక్రీస్తు నాడు యెరూషలేము దేవాలయానికి గాడిదపిల్లను అధిరోహించి వచ్చాడూ అంటే మనకు ఈపాటికే అర్ధం అయ్యే ఉంటుంది గాడిదకు మన తండ్రి ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చాడో.

ఇంకా లోతుగా పరిశీలిస్తే బైబిల్లో ప్రకటించబడిన దేవుని వాక్కును ఒకవైపు ప్రవక్తల ద్వారా, మరోవైపు ప్రవక్తల ప్రవచనాల ద్వారా లోకానికి అందించడంలో గాడిదపిల్ల దేవుని ప్రతినిధిగా వ్యవహరించిందని భావించవచ్చు.

అంతటి వైవిధ్యం కలిగిన గాడిదపిల్లను గురించి, దాని గొప్పదనాన్ని వివరించే ఆయా సందర్భాలకు సంబందించిన  3 ముఖ్యమైన విషయాలను మనమిప్పుడు ధ్యానించుకుందాం. 

1 గాడిద దేవునిద్వారా విమోచించబడినది. 

ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. నిర్గమకాండము 13:13. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మొదట జన్మించిన దూడను గానీ, గొర్రెపిల్లను గానీ యెహోవా దేవునికి సమర్పించవలసి ఉంది. కానీ గాడిదపిల్ల మాత్రం దానికి ప్రతిగా గొర్రెపిల్లను దేవునికి సమర్పించుకుని విమోచింపబడింది.  

ప్రతి తొలిచూలు పిల్లయు నాది, నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగాడి దూడయే గానీ గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపించవలెను. దాని విమోచింపని యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలువాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు నిర్గమకాండము 34:19-20. ఈ వాక్యం తేటతెల్లంగా మనకు చెప్పేది ఏమిటంటే గాడిదపిల్ల దేవునిద్వారా విమోచించబడింది అని. ఒకవేళ గాడిదపిల్ల బదులుగా గొర్రెపిల్లను సమర్పించడం ద్వారా గాడిద విమోచింపబడనట్లైతే, గాడిదపిల్లకు ఈ భూమ్మీద జీవించడానికి సాధ్యపడేది కాదు, ఎందుకంటే యేసయ్య దేవుని గొర్రెపిల్ల అని పరిశుద్ధగ్రంధమే చెబుతుంది కాబట్టి (యోహాను సువార్త 1:35-37). కాబట్టి గాడిదను పోలి జీవించుటలో మనం ఏ మాత్రం సిగ్గుపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తుద్వారా మనకు శాశ్వతమైన విమోచనము లభించింది కాబట్టి (ఎఫెసీ 1 :7 , ప్రకటన గ్రంధము 21:27). 

2. గాడిద వివేకము కలిగిన ప్రాణి 

సంఖ్యాకాండము 22:21-34 వ వచనం వరకు మనం గమనిస్తే ప్రవక్త అయిన బిలాము గ్రహించలేని దానిని ఓ గాడిద గ్రహిస్తుంది. బిలాము చూడలేని దానిని గాడిద చూడగలుగుతుంది. దేవుని దూతను చూడలేని బిలాము గాడిదను అడ్డుకుంటున్నా.. కొడుతున్నా కూడా ఆ గాడిద యెహోవా దూతను చూచి తాను నడుస్తున్న త్రోవను విడిచి పొలాల్లోకి తీసుకువెళుతుంది, చివరకు ప్రాణాలు తీయడానికి ఎదురు నిలిచిన దేవుని దూత ఖడ్గపు బారినుండి బిలామును రక్షించి కాపాడగలుగుతుంది.

అదేవిధంగా 2 పేతురు 2 :16 వచనంలో తెలిపినట్లు గాడిద నోరులేని ప్రాణి అయినా కూడా బిలాముకంటే వివేకము కలిగి వ్యవహరించిందని పేతురు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో గాడిదను పోలి వివేకంతో జీవించాలి. బిలామును గాడిద ఏ విధంగానైతే హెచ్చరించిందో అదే రీతిగా మనమూ ఈ లోకములో క్రీస్తును ఎరుగని వారికి ఆయన ప్రేమను గురించి, ఆయన అందించే రక్షణ గురించి తెలియచేయాలి. తెలియచేయడం మన బాధ్యత, వింటారో లేదో అది వారి సమస్య. మనం తెలిసీ యేసయ్యను గురించి ప్రకటించకపోవడం మన తప్పు అవుతుంది అని గ్రహించాలి. 

దీనికి సంబంధించి పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2:6-10 వచనాల్లో మన భాద్యతను గురించి చక్కగా వివరించాడు. 

3 గాడిద పిల్ల యేసయ్యను మోసి బహు ధన్యతను పొందినది. 

సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును, దీనుడునై, గాడిదపిల్లను ఎక్కి నీ యొద్దకు
వచ్చుచున్నాడు. జెకర్యా 9:9. మట్టల ఆదివారం నాడు గాడిదపిల్లను ఎక్కి ప్రజల  జయజయధ్వానాల మధ్య యేసుక్రీస్తు యెరూషలేము నగర ప్రవేశం చేస్తాడు. ఆనాడు అలా యేసయ్యను తనపై ఎక్కించుకుని మోయడం ద్వారా గాడిదపిల్ల ఎనలేని గౌరవాన్ని సంపాదించుకుంది. 

అందుకే పౌలు మనల్ని ఉత్తేజితులను చేస్తూ రోమా పత్రిక 12:1-2 లో ఇలా అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి రోమా పత్రిక 12:1-2. 

చూసారా, మనం దేనికి పనికిరాని వాళ్ళను గాడిదా అని సంబోధిస్తాము, కానీ అదే గాడిదకు పరిశుద్ధ గ్రంధములో మన తండ్రి ఎంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడో చూడండి. అందుకే మన ఆలోచనలు వేరు, తండ్రి ఆలోచనలు వేరు, మన చిత్తం వేరు ఆయన చిత్తం వేరు. ఆనాడు గాడిదపిల్లను విమోచించడానికి గొర్రెపిల్లను బలి ఇచ్చారు. ఆ తరువాత గాడిదపిల్లల వంటి మనకొరకు యేసయ్య గొర్రెపిల్లగా తనకు తానుగా బలిపశువుగా మారి మనకు శాశ్వత విమోచనము అందించాడు. విమోచింపబడిన మనం ఆయన కృపను మరువక దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయనకు మోసి.. ఈ లోకానికి దేవునివాక్కును, ఆయన అందించిన ప్రేమను పంచి సకల లోక రక్షణకు పాటుపడదాం. ఆమెన్.   

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి


ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

1 comment:

  1. Good Biblical Information. As per Bible Donkey is the very precious and Great Animal redeemed by God Christ.

    ReplyDelete

If you have any doubts, please let me know