Thursday, March 21, 2019

Jesus Fourth Word on the Cross - Eli, Eli, lema sabachthani -

నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు 
యేసుక్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట
Jesus Christ Seven Words on the Cross

యేసుక్రీస్తు తాను సిలువలో మరణించే ముందు పలికిన ఏడు మాటలు గురించి తెలియని క్రైస్తవులు ఉండరు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దినాలలో ఈ వాక్యాలు మీదే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం. ఈ ఏడు మాటల్లో ఒకటైన నాల్గవ మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేమిటో.. అందులో ఉన్న మర్మమేమిటో మనమిప్పుడు తెలుసుకుందాం.
నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు. మత్తయి సువార్త 27:46

మనకు ఒకింత ఆశ్చర్యం, ఆందోళన కలిగించే మాట ఇది. రోమన్ సైనికులు యేసును బంధించి, ఘోరాతి ఘోరంగా హింసించి ఆపై ఆయనను చంపడానికి సిలువ మ్రానుపై వ్రేలాడదీసిన ఆ శుక్రవారం రోజు.. యేసు సిలువలో మరణవేదన పొందుతూ ఏలి.. ఏలి.. లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేస్తాడు. ఆ మాటకు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్ధం. దీనినే మనం సిలువలో నాల్గవ మాటగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము (మత్తయి సువార్త 27:46 ).

క్రీస్తు జన్మించక మునుపే ఆయన దేవుని కుమారుడని ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి. యేసే తాను దేవుని కుమారుడనని శిష్యులతో పలుమార్లు ప్రస్తావిస్తాడు కూడా. మరి దేవుని కుమారుడైన యేసు ఓ మామూలు మనిషిలా అలా ఎందుకు తన తండ్రిని నన్నెందుకు చెయ్యి విడిచావు అని ప్రశ్నించాడు?

అంతేకాక యూదా ఇస్కరియోతు ద్వారా తనను బంధించి, మరణశిక్ష విధించి చంపుతారని యేసుకు ముందే తెలుసు, తాను చావుకు ఏమాత్రం భయపడకుండా తనకోసం వెదుకుతున్న సైనికులకు తానె ఎదురెళ్లి మరీ మీరు వెదుకుతున్న యేసును నేనే అని చెప్తాడు. ఇంత తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించాడు. ఇందులో ఉన్న మర్మం ఏమిటి? ఇంత లోతైన విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి.. అప్పుడు మన విశ్వాసం మరింతగా బలపడుతుంది..

యేసు ప్రభువు జీవించిన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు హెబ్రీ అరామిక్ భాషలను మాట్లాడేవారు. ఈ ఏలి ఏలి లామా సబక్తానీ అనే వాక్యంలో ఏలి అనే పదం హెబ్రీ భాషకు చెందినది అయితే... లామా సబక్తానీ అనే పదం అరామిక్ భాషకు సంబంధించి పదం.
యేసుక్రీస్తు సిలువలో ఈ మాటలు పలికినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రవక్త ఐన ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని భావిస్తారు. కానీ ఈ మాటకు గ్రంధకర్తలు నాదేవా.. నా దేవా.. నన్నెందుకు చెయ్యి విడిచావు అని సరియైన అర్ధం మనకు అప్పుడే చెప్పారు.

తన తండ్రి తనకు అప్పగించిన పని పూర్తి చేయడానికే తాను ఈ లోకానికి వచ్చానని యేసుకు  తెలుసు, అదేవిధంగా తాను ఎవరినైతే వారి పాపాలనుండి రక్షించి పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించాలని తలంచాడో ఆ మనుష్యులే నేడు తనను సిలువ వేసి ఘోరంగా చంపుతారని క్రీస్తుకు తెలుసు, అలాగే ఆయన శిష్యులకూ తెలుసు. కాబట్టి ఆయన సిలువపై వేదన చెందడం అక్కడే ఉన్న ఆయన జనాంగానికి పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కాబట్టి వారూ కంగారు పడలేదు. కానీ అక్కడే ఉన్న యెరూషలేము పట్టణవాసులు మాత్రం వాస్తవాన్ని తెలుసుకోలేక క్రీస్తు ఏలీయాను పిలుస్తున్నాడు కాబోలు అని అనుకున్నారు.

దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని యేసు ఎందుకు తన తండ్రి ప్రశ్నించి ఉంటాడు? ఎందుకు ఓ సాధారణమైన మామూలు మనిషిలా సిలువపై అంత దీనంగా తన తండ్రిని అర్ధించాడు? ఈ విషయాలను లోతుగా అధ్యయనం చేస్తే యేసు మొదట దేవుని కుమారుడు, కానీ తనకు తానుగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు అయ్యాడు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుని కుమారుడు, అదేవిధంగా ఆయన ఈ భూమిపై జన్మించడం మూలాన పరిపూర్ణమైన మనుష్య కుమారుడుగా కూడా తనను తానూ మార్చుకున్నాడు.

మత్తయి సువార్తలో మనం యేసు సిలువ మరణం పొందే సందర్భాన్ని ధ్యానం చేస్తుంటే కీర్తనలు 22 వ అధ్యాయం మనకు తప్పక జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి మరణానికి చేరువ అవుతుంటే ఆ వ్యక్తి ఎంతటి ఎంతటి వేదనను అనుభవిస్తాడో క్రీస్తు కూడా ఓ సాధారణ మనిషిలా తనకు తానుగా సిలువలో కష్టాన్నిఅనుభవించాడు, మౌనంగా భరించాడు, అందులోని బాధను తన తండ్రికి విన్నవించాడు.. అలా మనకు ప్రతినిధిలా.. తండ్రికి మనకు మధ్య ఓ వారధిలా ఆ రోజు యేసు సిలువలో మన పక్షాన సాధారణ మనిషిలా నిలిచి శిక్షను అనుభవించి దేవుని కుమారునిలా మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు.

కాబట్టి ఆనాడు సిలువలో క్రీస్తు అనుభవించిన ఆ వేదన ఓ సాధారణ మనిషి అనుభవంలా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా కీర్తనల గ్రంధంలో చెప్పినట్లు.. 'ఈ భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవా తట్టు చేసెదరు (కీర్తనలు 22:27) అనే వాక్యాన్ని తనకూ ఆపాదించుకుంటూ క్రీస్తు కూడా తన తండ్రి వైపు తిరిగి కన్నులెత్తి రోదించాడు అని భావించాలి.

దీన్ని బట్టి యేసు సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని తన తండ్రిని ప్రశ్నించడంలో ఉన్న పరమార్ధం మీకు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుంది. క్రీస్తు మనకొరకు సిలువలో కన్నీరు కార్చాడు, మనకు సమానార్ధమైన శిక్షను తాను భరించాడు. ఓ మానవ మాత్రునిలా మన స్థానంలో ఉండి  మనకొరకు తన తండ్రిని సైతం ప్రశ్నించాడు. మరి ఇంకా మన జీవితాలు మారకుంటే క్రీస్తు సిలువలో కార్చిన రక్తానికి ఫలితమేముంటుంది? ఆయన అనుభవించిన వేదనకు అర్ధం ఏముంటుంది? ఆలోచించండి!

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి

యేసు సిలువలో నాదేవా నన్నెందుకు చేయి విడిచావన్నాడు?ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

No comments:

Post a Comment