December 15, 2018

నజరేతును గురించి మీరు ఊహించలేని 5 విషయాలు - 5 FACTS ABOUT NAZARETH

నజరేతు గురించి తెలియని ఐదు ముఖ్యమైన విషయాలు

బేత్లెహేము కంటే నజరేతు ప్రాముఖ్యమైనదా ? యెషయి మొద్దు చిగురు నజరేతు పట్టణమా ?
నజరేతు పట్టణం..

బేత్లెహేములో జన్మించిన క్రీస్తు నజరేయుడైన క్రీస్తు అని అనిపించుకున్నాడు!

దావీదు వంశస్థులు ఎందరో నజరేతు పట్టణం లో తలదాచుకున్నారు? ఎందుకు? యేసు క్రీస్తును తనవారి నజరేతులో చంపాలని శతవిధాలా ప్రయత్నించారు?
గాబ్రియేలు అనబడే దేవుని దూత కన్య అయిన మరియకు కనిపించి యేసుక్రీస్తు జననం గురించి ఆమెకు తెలియజేసింది ఈ నజరేతు పట్టణంలోనే. పరిశుద్ధ గ్రంధములో బేత్లెహేముకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. నజరేతుకు కూడా అంటే ప్రాముఖ్యత ఉంది. అందుకే యేసు ఆనాడు నజరేతువాడు అని పిలిపించుకున్నాడు. అంతటి ప్రాధాన్యత నజరేతుకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ ఐదు విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి.


1 నజరేతు పట్టణం క్రీస్తు జన్మించే నాటికే పేరొందిన చిన్న పట్టణం

క్రీస్తు జన్మించే నాటికి సుమారు 120 నుండి 150 మంది ప్రజలు నజరేతు పట్టణంలో నివసిస్తూ ఉండేవారని పురావస్తు శాఖ వారి అంచనా. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం 46 వ వచనంలో ఫిలిప్పుతో నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని తన సందేహాన్ని బయటపెడతాడు.

అతని సందేహాన్ని మనం అంత సులభంగా కొట్టేయ్యలేము, ఎందుకంటే నజరేతు వ్యవసాయం మీద ఆధారపడ్డ చిన్న పట్టణం. కొండ అంచులమీద కొద్దిపాటి కుటుంబాలతో నిర్మించబడ్డ గ్రామం. ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ప్రసిద్ధి చెందిన వర్తక వ్యాపార కేంద్రాలకు ఎంతో దూరంగా విసిరేయబడినట్టు ఉండేది ఈ నజరేతు గ్రామం. అంతే కాదు... తమను పాలించబోయే మెస్సీయ త్వరలో వస్తాడని భావించే ఇశ్రాయేలు ప్రజలు ఆయన నజరేతునుండి వస్తాడని కలలో కూడా ఊహించలేని చిన్న పట్టణం నజరేతు. అందుకే ఆరోజు నతానియేలు ఫిలిప్పుని అలా ప్రశ్నించాడు.

2 మెస్సీయ నజరేతు నుండే రానున్నాడని యేసు పుట్టడానికి 600 యేళ్లముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు.

యెషయా గ్రంధం 11 వ అధ్యాయం 1 వ వచనంలో యెష్షయి మొద్దునుండే చిగురు పుట్టును, వాని అంకురము ఎదిగి ఫలించును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. హిబ్రు భాషలో నట్జర్ ఆంటే కొమ్మ లేదా చిగురు అని అర్ధం. ఈ నట్జర్ అనే పదం నుండే నజరేతు అనే పదం వచ్చిందని చరిత్రకారులు భావిస్తారు. మరికొంత మంది ఈ నజరేతు పట్టణాన్ని మరొక పట్టణానికి కొమ్మగా.. లేదా చిగురుగా భావిస్తారు. ఆంటే దావీదు వంశం ఉద్భవించిన బేత్లెహేము కాలానుగుణ మార్పులతో మొద్దుగా మారగా ఆ మొద్దు నుండి ఉద్భవించిన చిగురు ఈ నజరేతు పట్టణం చరిత్రకారుల అభిప్రాయం అని మనం భావించవచ్చు.
మత్తయి సువార్తికుడు యెషయా గ్రంధములోని 11 వ అధ్యాయం మొదటి వచనాన్ని గుర్తుచేస్తూ .. మత్తయి సువార్త 2 వ అధ్యాయం 23 వ వచనంలో యోహాను మరియలు గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన (యేసు) నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను అని యెషయా గ్రంధ ప్రవచన నెరవేర్పును ఉదాహరిస్తాడు.

3 ఆనాడు నజరేతులో నివాసముండే వారందరూ రాజకుటుంబానికి చెందినవారే.

పాత నిబంధనా గ్రంధములోని చరిత్రను గమనిస్తే.. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బాబిలోనుకు తీసుకువెళ్లిన తరువాత క్రి.పూ 538 లో పర్షియా రాజైన కోరెషు యూదులను తిరిగి తమ స్వదేశమైన యూదయ తిరిగి రావడానికి అనుమతిని ఇస్తాడు. ఆ క్రమంలో యూదులు బాబిలోను నుండి యూదయ దేశం తిరిగి రావడం ప్రారంభిస్తారు. అయితే అప్పుడు ప్రారంభమైన ఆ వలస అప్పటినుడి ఆ తరువాత 400 నుండి 500 సం.ల కాలం వరకు యూదులు తిరిగి తమ దేశానికి తిరిగి వస్తూనే ఉంటారు.

ఆ క్రమంలోనే క్రి.పూ 100 సం. ప్రాంతంలో దావీదు వంశానికి చెందిన కొంతమంది ప్రజలు ఇశ్రాయేలు దేశానికీ తిరిగి వచ్చి నజరేతు పట్టణంలో నివాసాలు ఏర్పరచుకుని స్థిరపడతారు. అయితే ఇక్కడ మనకు ఓ సందేహం వస్తుంది. అదేంటంటే ఆ వచ్చినవారు దావీదు సంతతి అయితే వారు తిరిగి యెరూషలేము రావచ్చు కదా! వచ్చి సింహాసనాన్ని ఆక్రమించుకోవచ్చు కదా! అదీ కాకుంటే వారు దావీదు పట్టణమైన బేత్లెహేము వచ్చి అక్కడ స్థిరపడవచు కదా అని.

దీనికి సమాధానం ఆనాడు ఇజ్రాయెలీయిలు వారున్న స్థితికి భయపడి యెరూషలేముకు దూరంగా బేత్లెహేముకు 157 కి.మీ దూరంలో ఓ కొండా చెరియగా ఉన్న నజరేతులో స్థిరపడ్డారని చరిత్రకారుల అభిప్రాయం. ఇశ్రాయేలీయులు అంత భయపడాల్సిన అవసరం ఏంటా అని మనం ఆనాటి సమకాలీన ప్రరిస్థితులను గనుక పరిశీలిస్తే.. నజరేతులో స్థిరపడిన యూదులు బాబిలోను నుండి ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించే సమయంలో యూదయ దేశాన్ని హాస్మోనియన్స్ పరిపాలిస్తూ ఉంటారు. వీరు యుధులైన దావీదు సంతతి వారు కాదు. ఆ తరువాత కూడా యుదాయేతరుడు అయిన హేరోదు మహారాజు ఇశ్రాయేలు సింహాసనాన్ని ఆక్రమించుకుని పరిపాలిస్తూ ఉంటాడు.
కానీ అధిక సంఖ్యాకులైన యూదా జాతి ప్రజల వలన తన రాజ్యానికి.. అధికారానికి ముప్పు వస్తుందేమో అని హేరోదు అనేకమంది యూదులను పట్టి బంధించి హతమారుస్తాడు. అందులోనూ ప్రత్యేకంగా దావీదు సంతతి వారిని ఎక్కువగా చంపిస్తాడు. మత్తయి సువార్త రెండవ అధ్యాయంలో హేరోదు మానసిక ఆందోళన చెంది భవిష్యత్తులో ముప్పు వస్తుందని.. సింహాసనం చేజారి పోతుందనే భయంతోనే రెండేళ్ల లోపు పసికందులను నిర్దాక్షిణ్యంగా చంపించినట్టు చరిత్ర మనకు తెలియపరుస్తుంది.
అందువలనే దేవదూత యేసేపుకు ప్రత్యక్షమై ఈజిప్టు కు వెళ్లి తలదాచుకొమ్మని చెప్పి మరియా యేసోపులను ఈజిప్టు కు పంపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో తమను తాము కాపాడుకోవడానికే ఆనాడు బాబిలోను నుండి వచ్చిన దావీదుకు చెందిన రాజవంశీయుల్లో కొందమంది యెరూషలేముకు దూరంగా నజరేతులో తలదాచుకున్నారు. ఈ వివరణను బట్టి నజరేతు వారు యెష్షయి మొద్దునుండి వచ్చిన చిగురే అని రూఢీ పరుచుకోవచ్చు.

4 నజరేతులు నివసించేవారందరూ ఒకరికి ఒకరు కావలసినవారే

యూదులు ముఖ్యంగా దావీదు సంతతి వారు ఉన్మాది అయినా హేరోదు రాజుకు భయపడి దేశమంతటా చెల్లాచెదరై ఒకరికి ఒకరు సంబంధం లేకుండా.. తమ ఉనికి బయట పడకుండా.. రహస్యంగా చాలా సాదాసీదాగా జీవించేవారు. అలా భయపడి రహస్యంగా జీవించినవారిలో ఒక పెద్ద సమూహమే ఈ నజరేతు పట్టణవాసులు. వీరంతా ఒకరికి ఒకరు దగ్గరి బంధువులే.

అందువలనే యెషయా ప్రవక్త ప్రవచించిన మెస్సీయను నేనే అని యేసుక్రీస్తు ఆనాడు ఈ ప్రపంచానికి చాటగానే.. నజరేతులో నివసిస్తున్న యేసు రక్తసంబంధీకులు అనేకమంది యేసుక్రీస్తు మీద ఉక్రోషాన్ని ప్రదర్శించింది అందుకే. అందుకే ఆనాడు వారు క్రీస్తు వలన తమ కుటుంబాలకు రాజు నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని భయపడే.. ఏ మాత్రం దయలేకుండా యేసును కొండచరియ అంచుకు తీసుకెళ్లి క్రిందకు త్రోసి చంపాలని ప్రయత్నించారు.

5 నజరేతు పట్టణం యేసు బోధించిన ఎన్నో ఉపమానాలు ఆదర్శంగా నిలచింది.

నజరేతు చిన్న పట్టణం, అయినా దానికి ఎన్నో విశిష్టతలు ఉన్నట్లు పురావస్తు శాఖవారు జరిపిన త్రవ్వకాలలో రూఢీ అయ్యింది. ఎత్తైన కొండచరియాలను.. ద్రాక్షా తోటలకొరకు అనువుగా మార్చుకుని ఉపయోగించుకోవడం, ద్రాక్ష తోటను పరిశ్రమగా తీర్చిదిద్ది వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా మార్చుకోవడం, వ్యవసాయ భూములకు నీటి సరఫరా యంత్రాంగం, కాపలాదారులు ఎత్తైన వాచ్ టవర్స్ నిర్మించడం వంటి వాటిని ఎన్నో మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

యేసు జీవించిన కాలంలోనే నజరేతు గొప్పగా అభివృద్ధి చెందినట్లుగా చరిత్ర చెబుతుంది. విత్తువాని గురించి, గోధుమలను గురించిన ఉపమానం, ద్రాక్షతోట యజమాని కుమారుణ్ణి చంపిన పొలం కౌలు వాని గురించి ఎలాంటి ఎన్నో ఉపమానాలు బోధించేప్పుడు యేసుక్రీస్తుకు తన సొంత గ్రామమైన నజరేతు ప్రేరణ తప్పక ఎంతో కొంత ఉండి ఉంటుంది.

ఇవీ నజరేతు పట్టణానికి ఉన్న ప్రత్యేకతలు, చిన్న పట్టణమైన యేసయ్యను కలిగి ఉండడం మూలానా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఆరాధ్యనీయుడైన యేసయ్యను మనము మన జీవితాల్లో కలిగిఉంటే అంతే ప్రాముఖ్యత మనకూ.. మన జీవితాలకు తప్పక వస్తుంది, యేసయ్యలో గొప్ప సార్ధకత లభిస్తుంది. ఆమెన్.

ఈ వీడియో మీకు నచ్చినట్లైతే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు. ముఖ్యంగా మా HOPE Nireekshana TV channel లోని వీడియోల updates ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే తప్పక మా చానల్ ని subscribe చెయ్యగలరు, మరియు మా updates కోసం బెల్ల్ గుర్తుని క్లిక్ చెయ్యగలరు.

ఈ వీడియోని చూడటానికి ఈ లింకుని క్లిక్ చెయ్యండి
Clik Link here: https://youtu.be/6_bbXQR_UzA




No comments:

Post a Comment

If you have any doubts, please let me know